85-crore-pending : న్యూ మానియా Andhra Prabha Exclusive Story

85-crore-pending : న్యూ మానియా Andhra Prabha Exclusive Story

  • పులివెందుల మెడికల్ కాలేజీకి నీర‌సం
  • పూర్తికి రూ.85 కోట్లే దూరం..!
  • 90 శాతం పనులు పూర్తి
  • .96 మంది డాక్ట‌ర్ల‌కు 18 మందే విధుల్లో
  • .627 పడకల ఆసుపత్రి. వైద్యుల కొరత
  • .స్కానింగ్, కంటి వైద్య సేవల‌కు బ్రేక్
  • .పెండింగ్ పనులు పూర్తి చేస్తే
  • కూటమి స‌ర్కారుకే జ‌నం నీరాజ‌నం

(పులివెందుల , ఆంధ్రప్రభ)

పులివెందులలో అత్యాధునిక వసతులతో నిర్మించిన డాక్టర్ వైఎస్సార్ ప్రభుత్వ మెడికల్ కళాశాల నిధుల కొరతతో అసంపూర్తిగా మిగిలిపోవడం స్థానికులను నిరాశకు గురిచేస్తోంది. దాదాపు రూ.500 కోట్లతో చేపట్టిన ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో 90 శాతం పనులు పూర్తయినా, మిగిలిన పనుల కోసం అవసరమైన రూ.85 కోట్లు విడుదల కాకపోవడంతో ప్రారంభానికి నోచుకోలేదు. 627 పడకల ఆసుపత్రిలో 96 మంది వైద్యులు ఉండాల్సి ఉండగా కేవలం 18 మంది మాత్రమే విధులు నిర్వహించడం, స్కానింగ్, నేత్ర వైద్య సేవలు అందుబాటులో లేకపోవడం రోగులకు ఇబ్బందిగా మారింది. మిగిలిన నిర్మాణ పనులు పూర్తి చేసి అవసరమైన వైద్యులను నియమిస్తే పులివెందులలో అత్యున్నత వైద్య సేవలు అందుబాటులోకి రావడంతో పాటు కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో మంచి పేరు వచ్చే అవకాశముందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
పులివెందుల పట్టణ శివారు కడప కువెళ్లే దారిలో నిర్మించిన డాక్టర్ వైఎస్సార్ ప్రభుత్వ మెడికల్ కళాశాల అత్యాధునిక వసతులతో జిల్లాలోనే ప్రధాన వైద్య విద్యా కేంద్రంగా రూపుదిద్దుకోవాల్సి ఉండగా, నిధుల కొరత కారణంగా అసంపూర్తిగానే నిలిచిపోయింది. దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో, 14.90 లక్షల చదరపు అడుగుల నిర్మాణ విస్తీర్ణంతో చేపట్టిన కళాశాల నిర్మాణానికి అప్పటి వైసిపి ప్రభుత్వం రూ.500 కోట్ల వ్యయంతో పనులు చేపట్టింది. పూర్తయిన పనులకు రూ.415 కోట్ల వరకు నిధులు విడుదల చేసింది. నిర్మాణంలో సుమారు 90 శాతం పనులు పూర్తయినా, మిగిలిన పనులు నిధుల లేమితో నిలిచిపోయాయి.ప్రస్తుతం కేవలం చిన్నచిన్న మరమ్మతులు, పెయింటింగ్, విద్యుత్ పనులు, సిబ్బంది క్వార్టర్ల నిర్మాణం వంటి పనులు మాత్రమే మిగిలి ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ పనులన్నీ పూర్తిచేయడానికి సుమారు రూ.85 కోట్లు అవసరమని అంచనా. అవసరమైన నిధులు విడుదలైతే మెడికల్ కాలేజీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని వైద్య వర్గాలు భావిస్తున్నాయి.

85-crore-pending 78 మంది డాక్ట‌ర్ల కొరత

మెడికల్ కళాశాలకు అనుబంధంగా 627 పడకల హాస్పిటల్ నిర్మించారు. ఇందులో జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, గైనకాలజీ, పీడియాట్రిక్స్ తదితర విభాగాలతో పాటు అత్యాధునిక ఐసీయూ, అత్యవసర వైద్య సేవలు, నిర్ధారణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే ఆసుపత్రిలో ఉండాల్సిన 96 మంది వైద్యుల స్థానంలో ప్రస్తుతం కేవలం 18 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. మొత్తం 200 మంది ఉద్యోగులు, 90 మంది శానిటరీ సిబ్బంది, 40 మంది భద్రతా సిబ్బంది పనిచేస్తున్నప్పటికీ, నిపుణులైన వైద్యుల కొరత తీవ్రంగా కనిపిస్తోంది.

85-crore-pending స్కానింగ్, కంటి వైద్య సేవల‌కు బ్రేక్

ఆసుపత్రిలో అత్యాధునిక స్కానింగ్ పరికరాలు ఉన్నప్పటికీ, వాటిని నిర్వహించే వారు లేకపోవడంతో స్కానింగ్ సేవలు నిలిచిపోయాయి. దీంతో రోగులు స్కానింగ్ కొరకు తప్పనిసరిగా కడపకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. అలాగే కంటి వైద్యుడు లేకపోవడంతో నేత్ర పరీక్షలు కూడా జరగడం లేదు. సీనియర్ వైద్యులు లేకపోవడంతో జూనియర్ డాక్టర్లే ఎక్కువ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. చిన్నచిన్న సమస్యలు వచ్చినా రోగులను కడపకు రెఫర్ చేస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు.

85-crore-pending నెండింగ్ లో పనులు

సిబ్బంది క్వార్టర్లు పూర్తికాలేదు. పెయింటింగ్, విద్యుత్ పనులు, ఇతర అంతర్గత పనులు పెండింగ్‌లోనే ఉన్నాయి. నాబార్డ్ నిధులతో నిర్మిస్తున్న ఈ భవనానికి అవసరమైన మిగిలిన నిధుల కోసం జిల్లా వైద్య ఆరోగ్య మౌలిక సదుపాయాల ఇంజినీరింగ్ సంస్థ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది. అయితే ఇప్పటివరకు స్పష్టమైన స్పందన రాలేదని సమాచారం.ప్రస్తుతం పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రిని ఈ భవనంలోకి మార్చి నిర్వహిస్తున్నారు. మెడికల్ కళాశాల కోసం నియమించిన పలువురు ప్రొఫెసర్లను ఇతర ప్రాంతాలకు బదిలీ చేయడంతో ఆసుపత్రి నిర్వహణపై ప్రభావం పడిందని చెబుతున్నారు. అలాగే దంత వైద్య విభాగంలో కూడా రోగులకు సరైన పరీక్షలు చేయకుండా మందులు రాస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

85-crore-pending కూట‌మి స‌ర్కారు కరుణ కోసం..

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందులలో ఈ మెడికల్ కళాశాల నిర్మాణం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించినప్పటికీ అసంపూర్తిగా ఉండిపోవడం పట్ల స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన రూ.85 కోట్లను విడుదల చేసి నిర్మాణాన్ని పూర్తి చేయడంతో పాటు వైద్యులు, నిపుణులైన సిబ్బందిని నియమిస్తే ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని వారు అభిప్రాయపడుతున్నారు.అలాగే కూటమి ప్రభుత్వం ఈ కళాశాలను ప్రాధాన్యంగా తీసుకుని త్వరితగతిన పూర్తి చేస్తే రాయలసీమలో అత్యుత్తమ ప్రభుత్వ వైద్య విద్యా కేంద్రంగా అభివృద్ధి చెందడమే కాకుండా ప్రజల్లో కూడా మంచి గుర్తింపు పొందే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును పూర్తిచేయాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.