మూడు రజతాలతో మెరిసిన గురునాయుడు..

  • శాప్ చైర్మన్ రవి నాయుడు ప్రశంసలు

( విజయవాడ, ఆంధ్రప్రభ) : ఆసియా జూనియర్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ పోటీల్లో మూడు రజత పతకాలు సాధించి సత్తాచాటిన గురునాయుడిని శాప్‌ చైర్మన్‌ ఏ. రవి నాయుడు అభినందించారు. గ్రామీణ ప్రాంతం నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగి ఆసియా వేదికపై పతకాలు సాధించడం గురునాయుడి ప్రతిభకు నిదర్శనమని ఆయన ప్రశంసించారు. పోటీల్లో గురునాయుడు స్నాచ్‌లో 119 కిలోలు, క్లీన్‌ అండ్‌ జర్క్‌లో 146 కిలోలు ఎత్తి ప్రతిభ కనబరిచారని తెలిపారు. మొత్తం 256 కిలోల బరువును ఎత్తి మూడు రజత పతకాలను తన ఖాతాలో వేసుకున్న గురునాయుడి ప్రదర్శన అభినందనీయమన్నారు.

గ్రామీణ ప్రాంతం నుంచి ఎదిగి అంతర్జాతీయ స్థాయిలో రాణించడం ఎంతో స్ఫూర్తిదాయకమని రవి నాయుడు పేర్కొన్నారు. గురునాయుడి విజయం విజయనగరం జిల్లాతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణమని అన్నారు. కఠోర సాధన, పట్టుదలతో మరిన్ని అంతర్జాతీయ విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. యువ క్రీడాకారుల్లో ప్రతిభను వెలికితీసి వారిని ప్రోత్సహించేందుకు శాప్‌ ఎల్లప్పుడూ ముందుంటుందని రవి నాయుడు తెలిపారు.