కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అంబాల స్వామి ఘాటు విమర్శలు..
చినుకు పడితేనే గల్లీలు చిత్తడిగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం
ఎల్కతుర్తి , ఆంధ్రప్రభ : గ్రామపంచాయతీ ఖాతాలో నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ గ్రామ సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సర్పంచ్ తీరుపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అంబాల స్వామి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శనివారం ఎల్కతుర్తి గ్రామపంచాయతీ పరిధిలోని పలు వార్డులను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ చిన్న చినుకు పడితేనే గల్లీలు చిత్తడిగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజలు సేవ చేయాలని ఓటేసి గెలిపిస్తే పేరుకే సర్పంచ్‌గా కూర్చోవడానికా లేక నిధులు ఉన్నా పనులు చేయకపోవడం ప్రజలను మోసం చేసినట్టే అని ఘాటుగా విమర్శించారు.
గ్రామపంచాయతీకి వివిధ ఫైనాన్స్ కమిషన్ నిధులు వచ్చినప్పటికీ వాటిని ఖర్చు చేయకుండా ఖాతాల్లోనే నిల్వ ఉంచడం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కోసం కోట్లాది రూపాయలు కేటాయిస్తూ ముందుకు సాగుతుంటే ఎల్కతుర్తి సర్పంచ్ మాత్రం అభివృద్ధిని అడ్డుకుంటూ ప్రభుత్వానికే చెడ్డపేరు తెచ్చే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
వర్షం పడితే ప్రజలు బురదలో నడవాల్సిన పరిస్థితి దురదృష్టకరం. గ్రామ ప్రజలపై కనీస చిత్తశుద్ధి ఉంటే వెంటనే సమస్యాత్మక గల్లీల్లో మొరం పోసి వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి. లేకపోతే ప్రజల ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుందని హెచ్చరించారు.
అలాగే గ్రామ అభివృద్ధి పట్ల బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్న సర్పంచ్ ప్రజలకు సేవ చేయలేకపోతే తక్షణమే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
