భీమవరంలో అంతే..
- నిబంధనలు పాతాళంలోకి.. నిర్మాణాలు ఆకాశంలోకి..
- అన్నిచోట్ల అదే తంతు
- నిర్మాణ దశలోనే నిబంధనలకు నీళ్లు
- మామూళ్ల మత్తులో జోగుతున్న టౌన్ ప్లానింగ్..
నిఘా విభాగం, ఆంధ్రప్రభ : పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలో ప్రభుత్వ నిబంధనలను టౌన్ ప్లానింగ్ అధికారులు తుంగలో తొక్కుతున్నారు. భవన నిర్మాణాలకు సంబంధించి ఎన్ని నియమాలు ఉన్నా వాటన్నిటిని ఇక్కడ అతిక్రమించేయడం అలవాటుగా మారిపోయింది. టౌన్ ప్లానింగ్ నియమాలు, నిబంధనలు ఎన్ని ఉన్నా.. మాకేం సంబంధం లేదు అన్నట్లుగా ఇక్కడ వ్యవహారాలు నడుపుతున్నారు. బిల్డింగ్ ప్లాన్‌తో సంబంధం లేదు, సెట్‌బ్యాక్‌లు వదిలేసే ప్రసక్తే లేదు. అన్నీ మాకు ముందుగానే సమర్పించుకుంటే అంతా మేము చూసుకుంటాం అన్నట్లు ఇక్కడి టౌన్ ప్లానింగ్ అధికారులు వ్యవహరిస్తున్నారు. నిర్మాణ దశలోనే నిబంధనలు గాలికొదిలేసి అడ్డుగోలుగా భవనాలు నిర్మించే వారికి పూర్తి సహాయ సహకారాలు అందించేస్తున్నారు.
సంబంధం లేకుండా నిర్మాణాలు

టౌన్ ప్లానింగ్ అధికారులకు సమర్పించే కాగితాల్లో ఉండే నిర్మాణానికి వాస్తవ నిర్మాణాలతో సంబంధం లేకుండా ఇక్కడి నిర్మాణాలు కొనసాగుతున్నాయి. రెసిడెన్షియల్ పర్మిషన్‌తో కమర్షియల్ భవనాలు నిర్మించినా కన్నెత్తి చూడరు. రోడ్లు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడం వంటివి కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నాయి. రిజర్వ్‌డ్ స్థలాలు, ఓపెన్ స్పేస్‌లు, రోడ్లు ఆక్రమణకు గురికావడం, సెట్‌బ్యాక్‌లు పాటించకపోవడం వల్ల భవిష్యత్తులో ట్రాఫిక్, డ్రైనేజీ, అగ్నిమాపక సమస్యలు తీవ్రమయ్యే ప్రమాదం పొంచి ఉంది. అధికారులు మాత్రం చోద్యం చూస్తూ మౌనం వహిస్తున్నారు. ప్లాన్ అప్రూవల్‌లు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు విషయంలో లొసుగులు కోకొల్లలుగా ఉన్నాయి. నిబంధనలు పాతాళంలోకి నిర్మాణాలు ఆకాశంలోకి ఇక్కడ కనిపిస్తున్నాయి.
తనిఖీలు నామ మాత్రమే..
భీమవరం జిల్లా కేంద్రంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో టౌన్ ప్లానింగ్ విభాగం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అక్రమ నిర్మాణాలపై తక్షణ సమగ్ర సర్వే చేసి చర్యలను ఎప్పటికప్పుడు తీసుకోవాలి. కానీ అటువంటి చర్యలు ఇక్కడ కనిపించవు. జిల్లా కేంద్రమైన భీమవరంలో అక్రమ నిర్మాణాలపై స్థానికులు ఫిర్యాదులు చేస్తే నామమాత్రపు తనిఖీలతో సరి పెట్టడం ఇక్కడ అలవాటు. తాత్కాలికంగా నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటారు.
ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించే వారికి అధికారులు మౌనమే సమాధానంగా భావించాల్సిన పరిస్థితి ఇక్కడ నెలకొంది. నిబంధనలను పట్టించుకోకపోవడం అధికారుల ఉదాసీనతకు భీమవరంలోని అక్రమ భవన నిర్మాణాలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. నిబంధనలు ఉల్లంఘించినవారిపై, అలాగే నిర్లక్ష్యం చేసిన అధికారులపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోకుంటే ఈ అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్టపడే అవకాశం కనిపించట్లేదు.
