శిల్పకళా వైభవానికి ప్రతీక.. బోధన్ వంద స్తంభాల గుడి
చత్రపతి యువజన సంఘం స్పష్టం
చారిత్రక కట్టడాన్ని ప్రభుత్వం వెంటనే పరిరక్షించి అభివృద్ధి చేయాలి
ఆలయ పరిరక్షణకు న్యాయపోరాటానికైనా సిద్ధం..
బోధన్, ఆంధ్రప్రభ : చారిత్రక ప్రాశస్త్యం కలిగిన బోధన్ వంద స్తంభాల గుడిని ప్రభుత్వం వెంటనే పరిరక్షించి అభివృద్ధి చేయాలని చత్రపతి యువజన సంఘం డిమాండ్ చేసింది. చారిత్రక కట్టడం ప్రస్తుతం నిర్లక్ష్యానికి గురై శిథిలావస్థకు చేరుతున్నప్పటికీ సంబంధిత శాఖల అధికారులు పట్టించుకోవడం లేదని సంఘం అధ్యక్షుడు అడ్లూరి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు.
బోధన్ పట్టణంలోని మాహాలక్ష్మి కల్యాణ మండపంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బోధన్‌కు ప్రాచీన చరిత్ర ఉందని, పట్టణంలోని వంద స్తంభాల గుడికి కూడా విశిష్టమైన చారిత్రక ప్రాధాన్యం ఉందని తెలిపారు. రాష్ట్రంలోని రామప్ప దేవాలయం, వేయి స్తంభాల గుడి, గోల్కొండ కోట వంటి చారిత్రక కట్టడాలను పరిరక్షిస్తున్న తరహాలోనే బోధన్ వంద స్తంభాల గుడిని కూడా ప్రభుత్వం సంరక్షించాలని కోరారు.
ఆలయాన్ని పురావస్తు శాఖ పరిధిలోకి తీసుకుని శాస్త్రీయ పద్ధతుల్లో పరిరక్షణ, అభివృద్ధి పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆలయంలో పూజలకు అనుమతి కల్పించడంతో పాటు, వంద స్తంభాల గుడి చరిత్రపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి సమగ్ర పరిశోధన చేపట్టాలని కోరారు.
ప్రభుత్వానికి న్యాయ నోటీసులు
ఈ అంశంపై గత నెల 21న ప్రభుత్వానికి న్యాయ నోటీసులు పంపినట్లు అడ్లూరి శ్రీనివాస్ తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మ్యూజియం శాఖ, ఎండోమెంట్స్ శాఖ, నిజామాబాద్ జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్ తదితరులకు నోటీసులు అందజేసినట్లు పేర్కొన్నారు.
ప్రభుత్వం 50 రోజుల్లో సానుకూలంగా స్పందిస్తుందనే నమ్మకం ఉందని, స్పందన లేకపోతే న్యాయపరంగా కోర్టులను ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు.
రాజకీయాలకు అతీతంగా ఉద్యమం
వంద స్తంభాల గుడి పరిరక్షణ కోసం అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, చరిత్రకారులు, మేధావులు, విద్యార్థులు, యువత కలిసి ఉద్యమించాలని చత్రపతి యువజన సంఘం పిలుపునిచ్చింది. ఈ అంశంలో రాజకీయ విభేదాలకు తావులేకుండా శాంతియుతంగా, న్యాయబద్ధంగా పోరాటాన్ని కొనసాగిస్తామని సంఘం ప్రతినిధులు తెలిపారు.
కార్యక్రమంలో గోపి కిషన్, గొడుగు ధర్మపురి, బుమేష్, దుర్గాప్రసాద్, శివరాజ్, పవన్, గౌతమ్, పెరిక వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
