యువతను మోసం చేశారు..
- డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి
- వైసిపి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్..
- కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్‌సీపీ రిలే నిరాహారదీక్ష
- విజయవాడ ధర్నాచౌక్‌లో మూడు రోజులుగా ఆందోళన
- లోకేశ్ మంత్రి పదవికి రాజీనామా చేయాలి..
- హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్
- బోండా ఉమా వ్యాఖ్యలకు వైసీపీ నేతల తీవ్ర అభ్యంతరం..
- విజయవాడ అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్
- దేవినేని అవినాష్, వెలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు ఆధ్వర్యంలో కొనసాగిన దీక్ష
విజయవాడ, ఆంధ్రప్రభ : కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నాచౌక్‌లో రిలే నిరాహారదీక్ష కొనసాగింది. డీఎస్సీ నియామకాలపై వచ్చిన ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపించాలని, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అమలు చేయాలని, విద్యార్థులు, ఉద్యోగులు, పేదలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని పార్టీ నాయకులు డిమాండ్ చేశారు.
ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ మంత్రి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఇన్‌చార్జి మల్లాది విష్ణు దీక్షలో పాల్గొన్నారు. పార్టీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, డివిజన్, మండల స్థాయి నాయకులు, నియోజకవర్గ పరిశీలకులు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, మాజీ మేయర్, మాజీ ఫ్లోర్ లీడర్, మాజీ డిప్యూటీ మేయర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్, మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి..

కూటమి ప్రభుత్వం యువతను మోసం చేసిందని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. ఈ వైఫల్యాలకు నిరసనగా మూడు రోజులుగా రిలే నిరాహారదీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎన్ని ఆందోళనలు చేస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ స్పందించడం లేదని విమర్శించారు. నిరుద్యోగ భృతిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదని అన్నారు. డీఎస్సీ నియామకాలపై వచ్చిన ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేశ్ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని వెలంపల్లి డిమాండ్ చేశారు.
యువత తరఫున ప్రశ్నిస్తే వ్యక్తిగత విమర్శలు, దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ శిబిరంపై జరిగిన ఘటనల నేపథ్యంలో ఎమ్మెల్యే బోండా ఉమా చేసిన వ్యాఖ్యలపై వెలంపల్లి తీవ్రంగా స్పందించారు. ప్రజా సమస్యలపై రాజకీయ చర్చకు రావాలని, వ్యక్తిగత దూషణలు, బెదిరింపులకు బదులుగా అంశాల వారీగా సమాధానం చెప్పాలని సవాల్ చేశారు. డీఎస్సీ వ్యవహారంపై తమ డిమాండ్లకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని అన్నారు.
ప్రశ్నలకు సమాధానం చెప్పాలి: దేవినేని అవినాష్

డీఎస్సీ అంశంపై ప్రశ్నిస్తుంటే కూటమి నాయకులు సమాధానం చెప్పలేకపోతున్నారని ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా పోలీసుల సహకారంతో తమ కార్యకర్తలపై, మహిళలపై దాడులు చేశారని ఆయన ఆరోపించారు. విజయవాడ అభివృద్ధిపై చర్చకు రావాలని టీడీపీ నాయకులకు అవినాష్ సవాల్ చేశారు. బెదిరింపులకు తమ బూత్ స్థాయి కార్యకర్తలు భయపడరని అన్నారు. బోండా ఉమా వ్యాఖ్యలు అదుపులో ఉండాలని సూచించారు. వైఎస్సార్‌సీపీ తిరిగి అధికారంలోకి వస్తే తమపై చర్యలు తీసుకుంటామంటూ చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు.
డీఎస్సీపై లోకేశ్ సమాధానం చెప్పాలి: మల్లాది విష్ణు
డీఎస్సీ నియామకాలపై మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పలు ప్రశ్నలు సంధించారు. ప్రభుత్వానికి సంబంధించిన నియామకాల్లో కొందరికి మొదటి ర్యాంకులు ఎలా వచ్చాయో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన జీవోలను ఎందుకు తీసుకువచ్చారు, ఎందుకు రద్దు చేశారో ప్రభుత్వం ప్రజలకు వివరించాలని కోరారు. డీఎస్సీ వ్యవహారంపై మంత్రి నారా లోకేశ్ సమాధానం చెప్పాలని, బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులను అవమానించేలా ప్రభుత్వం శ్వేతపత్రాలు విడుదల చేస్తోందని విమర్శించారు.
తమ నిరాహారదీక్ష శిబిరంపై దాడి జరిగిందని ఆరోపించిన మల్లాది విష్ణు.. ఎక్కడ దీక్షలు నిర్వహించాలో నిర్ణయించే అధికారం పోలీసులకు, ప్రభుత్వ యంత్రాంగానికి మాత్రమే ఉంటుందని అన్నారు. తమకు అనుమతి ఇవ్వడం, ఇవ్వకపోవడంపై రాజకీయ నాయకులు ఆదేశాలు జారీ చేయడం సరికాదన్నారు. విజయవాడలో జరుగుతున్న అభివృద్ధి, వ్యాపార కార్యకలాపాల విషయంలో అధికార పార్టీ నేతలపై పలు ఆరోపణలు చేశారు. తమ వద్ద పలు అంశాలకు సంబంధించిన సమాచారం ఉందని, సమయం వచ్చినప్పుడు వాటిని వెల్లడిస్తామని అన్నారు.
