ఎమ్మెల్యే కడియం శ్రీహరి

ఆగస్టు 14 నుంచి రిజర్వాయర్ల ద్వారా నీటి విడుదల
2,500 ఎకరాల ఆయకట్టుకు నీరందేలా కాలువల నిర్మాణం చేపట్టాలి
కాలువల ఆధునికీకరణకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి..
మూడు రోజుల్లో పూడికతీత, జంగిల్‌ క్లియరెన్స్ పూర్తి చేయాలని ఆదేశం

స్టేషన్‌ఘన్‌పూర్, ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి వరంగల్ : ఘనపూర్ రిజర్వాయర్‌ కింద ఉన్న పూర్తి స్థాయి ఆయకట్టుకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటామని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. రిజర్వాయర్‌ కింద సుమారు 2,500 ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు కాలువల నిర్మాణం, ఆధునికీకరణ చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు.

స్టేషన్‌ఘన్‌పూర్ రిజర్వాయర్ కుడి కాలువను నీటిపారుదల, మున్సిపల్ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి కడియం శ్రీహరి శుక్రవారం పరిశీలించారు. ఎస్సీ కాలనీ నుంచి వెళ్లే పంట కాలువ, తూము ప్రాంతంతో పాటు పలు కాలనీల్లో కాలువల పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా పంట కాలువలో మురుగునీరు కలుస్తుండటంపై ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. మురుగునీరు పంట కాలువల్లోకి చేరకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. అవసరమైన ప్రాంతాల్లో డ్రైనేజీలను పునఃరూపకల్పన చేసి, మురుగునీరు, వరదనీరు పంట కాలువల్లోకి రాకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేయాలని సూచించారు.

మూడు రోజుల్లో కాలువల శుభ్రత

ప్రస్తుతం పంటలకు సాగునీరు అందించేందుకు ఘనపూర్ కుడి కాలువలో పూడికతీత, జంగిల్‌ క్లియరెన్స్ పనులను వెంటనే చేపట్టి మూడు రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కాలువకు ఇరువైపులా సైడ్‌వాల్స్ నిర్మించి చివరి ఆయకట్టు వరకు నీరు చేరేలా ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు. రాబోయే మూడు నెలల్లో శాశ్వత కాలువ నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, వచ్చే వర్షాకాలం నాటికి కాలువల నిర్మాణం, ఆధునికీకరణ పనులను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కడియం శ్రీహరి అన్నారు.

ఆగస్టు 14 నుంచి నీటి విడుదల

దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగంగా 1.5 టీఎంసీల సామర్థ్యంతో ఘనపూర్ రిజర్వాయర్ ఏర్పాటు చేశారని కడియం శ్రీహరి తెలిపారు. రిజర్వాయర్ కింద సుమారు 2,500 ఎకరాల ఆయకట్టు ఉన్నప్పటికీ కాలువల వ్యవస్థ పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడంతో ఆశించిన మేర సాగునీరు అందడం లేదన్నారు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల కారణంగా ఆరుతడి పంటలకు కూడా నీటి కొరత ఏర్పడుతోందని తెలిపారు. నియోజకవర్గంలోని ధర్మసాగర్, స్టేషన్‌ఘన్‌పూర్, అశ్వరావుపల్లి, గండి రామారం, నవాబ్‌పేట తదితర రిజర్వాయర్లలో అందుబాటులో ఉన్న నీటిని సద్వినియోగం చేసుకుని రైతులకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆగస్టు 14 నుంచి నియోజకవర్గంలోని దేవాదుల రిజర్వాయర్ల ద్వారా సాగునీటిని విడుదల చేస్తామని కడియం శ్రీహరి ప్రకటించారు. 15 రోజుల పాటు నీటిని విడుదల చేసి, అనంతరం మరో 15 రోజుల పాటు రిజర్వాయర్లను తిరిగి నింపే విధంగా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు.

‘ఆన్‌.. ఆఫ్‌’ పద్ధతిలో నీటి విడుదల

ప్రస్తుతం నిరంతరాయంగా నీటిని విడుదల చేసే పరిస్థితి లేనందున ‘ఆన్‌.. ఆఫ్‌’ పద్ధతిలో సాగునీటిని విడుదల చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. కాలువల ద్వారా వచ్చే నీటిని రైతులు వృథా చేయకుండా ఆరుతడి పంటలకు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నీటి విడుదల విధానానికి రైతులు సహకరించాలని కోరారు. కాలువల్లోకి మురుగునీరు, వరదనీరు చేరకుండా మున్సిపల్, నీటిపారుదల శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని కడియం శ్రీహరి ఆదేశించారు. ప్రతి ఎకరాకు సాగునీరు అందేలా శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు.

కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్‌కుమార్, నీటిపారుదల శాఖ ఎస్‌ఈ సీతారాం, ఈఈలు, డీఈలు, మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.