పండుగల సాయన్నకు ఘన నివాళులు
తెలంగాణ రాబిన్‌హుడ్ సేవలకు ప్రభుత్వ గుర్తింపు ఇవ్వాలి
పండుగల సాయన్న జయంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలి
ఊట్కూర్, ఆగస్టు 8 (ఆంధ్రప్రభ): తెలంగాణ రాబిన్‌హుడ్ పండుగల సాయన్న జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు వెంకటరాములు, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు భరత్, మాజీ ఎంపీటీసీ హన్మంతు, వాణిజ్య సెల్ జిల్లా కన్వీనర్ కృష్ణయ్య గౌడ్, బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కొండన్ గోపాల్, మత్స్య సహకార సంఘం ఉపాధ్యక్షుడు వెంకటస్వామి డిమాండ్ చేశారు.
శనివారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని ఎల్బీనగర్ పడమటి ఆంజనేయస్వామి దేవాలయ ఆవరణలో ముదిరాజ్ మత్స్య సంఘం ఆధ్వర్యంలో పండుగల సాయన్న జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పండుగల సాయన్న ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో చెక్‌పోస్ట్ వద్ద పండుగల సాయన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసుకునేందుకు కృషి చేస్తామని తెలిపారు. ప్రజల కోసం పోరాడిన మహావీరుడు, తెలంగాణ గర్వకారణమైన ప్రజా వీరుడు పండుగల సాయన్న జయంతిని పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించాలని అన్నారు.
బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం తన జీవితాన్ని అంకితం చేసి, పెత్తందారీ వ్యవస్థను ధైర్యంగా ఎదిరించిన పండుగల సాయన్న స్ఫూర్తి నేటి తరానికి మార్గదర్శకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఆయన త్యాగం, ధైర్యం, ప్రజాసేవ, సామాజిక న్యాయం కోసం చేసిన పోరాటం భావితరాలకు ఆదర్శంగా నిలిచేలా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
తెలంగాణ ప్రభుత్వం పండుగల సాయన్న సేవలను అధికారికంగా మరింత గుర్తించి, ఆయన చరిత్రను భావితరాలకు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ముదిరాజ్, మత్స్య సంఘం నాయకులు భరత్, ఎస్. అశోక్‌కుమార్, ముద్దం రాము, ఆశన్న, లక్ష్మణ్, నాగేష్, హన్మంతు తదితరులు పాల్గొన్నారు.
