ప్రజల భాగస్వామ్యంతో నిఘా వ్యవస్థ బలోపేతం
ఎస్పీ విక్రాంత్ పాటిల్
నేరాల నియంత్రణ, ప్రజల భద్రతకు సీసీ కెమెరాలే కీలక ఆధారం
కర్నూలు రూరల్ బ్యూరో, ఆంధ్రప్రభ: నేరాల నియంత్రణ, ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాలు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని బి. తాండ్రపాడు సమీపంలోని కాదంబరి టౌన్షిప్లో ఏర్పాటు చేసిన 35 సీసీ కెమెరాలను శుక్రవారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించడం ద్వారా నేరాలను గణనీయంగా అరికట్టవచ్చన్నారు. నేరాల దర్యాప్తును వేగవంతం చేయడంలోనే కాకుండా, నేరస్తులను త్వరగా గుర్తించి చట్టం ముందు నిలబెట్టడంలో సీసీ కెమెరాల దృశ్యాలు కీలక ఆధారాలుగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.
రహదారి ప్రమాదాలు, దొంగతనాలు, గొడవలు, మహిళలు, చిన్నారుల భద్రతకు సంబంధించిన కేసుల విచారణలో సీసీ కెమెరాల ద్వారా లభించే వీడియో దృశ్యాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల నేరస్థుల్లో భయాందోళనలు పెరిగి, నేరాలకు పాల్పడే అవకాశాలు కూడా తగ్గుతాయని వివరించారు.
జిల్లాలోని ప్రతి కాలనీ, అపార్ట్మెంట్, వ్యాపార సంస్థలు, గ్రామాలు, ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాలు, ప్రవేశ, నిష్క్రమణ మార్గాల్లో నాణ్యమైన సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజల భాగస్వామ్యంతో నిఘా వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని, పోలీసులకు ప్రజల సహకారం ఉంటేనే నేరరహిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని ఎస్పీ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కర్నూలు డీఎస్పీ రాఘవేంద్ర, సీఐ కేశవరెడ్డి, కర్నూలు తాలూకా సీఐ తేజమూర్తి, కాదంబరి టౌన్షిప్ కాలనీ కార్యదర్శి మధుమోహన్, అధ్యక్షుడు కరుణాకర్ బాబు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
