ఆడి కృత్తిక మహోత్సవంలో ఎమ్మెల్యే కామినేని

ముదినేపల్లి, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అస్యూరెన్స్ కమిటీ చైర్మన్, కైకలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్ శుక్రవారం ముదినేపల్లి మండలం శింగరాయపాలెం గ్రామంలోని శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో నిర్వహించిన ఆడి కృత్తిక కావడి సేవా మహోత్సవంలో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్ స్వయంగా కావడి మోసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు వేదమంత్రోచ్చారణల మధ్య తీర్థప్రసాదాలు అందించి ఎమ్మెల్యేను ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నట్లు నిర్వాహకులు తెలిపారు. రాష్ట్ర ప్రజలు సుఖశాంతులు, సస్యశ్యామలంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు చెప్పారు.

ఈ కార్యక్రమంలో ఎన్డీయే నాయకులు, ప్రజాప్రతినిధులు, దేవస్థానం పాలకవర్గ సభ్యులు, ఆలయ అర్చకులు, దేవస్థానం సిబ్బంది, భక్తులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.