రూ.70.66 లక్షల మోసం..!

  • గోల్డ్ లోన్ మోసం ఛేదించిన పోలీసులు
  • ప్రధాన నిందితుడు అరెస్ట్..
  • రూ.30.20 లక్షల నగదు స్వాధీనం..
  • బెంగళూరులో గుర్రపు పందేల కోసం బ్యాంకును మోసగించిన మాజీ గోల్డ్ అప్రైజర్

శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ: శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలోని కెనరా బ్యాంకులో జరిగిన రూ.70.66 లక్షల గోల్డ్ లోన్ మోసం కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు, మాజీ గోల్డ్ అప్రైజర్ సుందరేష్ చారిని అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి రూ.30.20 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను అడిషనల్ ఎస్పీ కేవీ మహేష్, మడకశిర సీఐ రాజ్‌కుమార్ మీడియాకు వెల్లడించారు.

పోలీసుల కథనం ప్రకారం.. అనంతపురంలోని కెనరా బ్యాంక్ రీజినల్ కార్యాలయం నుంచి వచ్చిన రీ-అప్రైజర్ల బృందం మడకశిర శాఖలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో ఏడుగురు ఖాతాదారుల పేర్లపై ఉన్న 12 గోల్డ్ లోన్ ఖాతాల్లో తాకట్టు పెట్టిన సుమారు 872.8 గ్రాముల బంగారు ఆభరణాలు నకిలీవని గుర్తించారు. నకిలీ బంగారాన్ని అసలైనదిగా ధృవీకరించి బ్యాంకు నుంచి రూ.70,66,000 గోల్డ్ లోన్ మంజూరు చేయించినట్లు తేలడంతో బ్యాంకు అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో మడకశిర పోలీసులు క్రైమ్ నంబర్ 91/2026గా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు, అడిషనల్ ఎస్పీ అంకిత సురాన ఐపీఎస్, పెనుకొండ సబ్‌డివిజన్ ఇన్‌చార్జి డీఎస్పీ నారాయణస్వామి పర్యవేక్షణలో మడకశిర సీఐ రాజ్‌కుమార్ కేసును దర్యాప్తు చేశారు.

దర్యాప్తులో మాజీ గోల్డ్ అప్రైజర్ సుందరేష్ చారి తన అధికారాన్ని దుర్వినియోగం చేసినట్లు వెల్లడైంది. ఖాతాదారులతో పరిచయాలు పెంచుకుని, వారి పేర్లపై నకిలీ బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టించి, వాటిని అసలైన బంగారంగా ధృవీకరించి బ్యాంకు నుంచి భారీ మొత్తంలో రుణాలు మంజూరు చేయించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ విధంగా పొందిన డబ్బుతో బెంగళూరులో గుర్రపు పందేలు ఆడుతూ విలాసవంతమైన జీవితం గడిపినట్లు దర్యాప్తులో తేలింది.

ఈ నేపథ్యంలో మడకశిర పట్టణంలోని వై.బి. హళ్లి క్రాస్ వద్ద నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.30.20 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు, కేసులో ఇతర నిందితుల పాత్రపై కూడా దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

ఈ సందర్భంగా ప్రజలు బంగారు రుణాలు తీసుకునే సమయంలో బ్యాంకు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ఎలాంటి అనుమానాస్పద లావాదేవీలు కనిపించినా వెంటనే పోలీసులకు లేదా బ్యాంకు అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

అదేవిధంగా బ్యాంకులు గోల్డ్ అప్రైజర్ల నియామకంలో పూర్తి స్థాయి పరిశీలన చేపట్టడంతో పాటు వారి పనితీరుపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. అప్రైజర్ల నివేదికలపైనే పూర్తిగా ఆధారపడకుండా బ్యాంకు సిబ్బంది కూడా తగిన అవగాహనతో అప్రమత్తంగా వ్యవహరించాలని పోలీసులు పేర్కొన్నారు.