ఐఐటీ తిరుపతిలో ‘ఇన్‌స్పైర్ వర్క్స్’ ప్రారంభం

  • కియా ఇండియా–ఐఐటీ భాగస్వామ్యానికి మరో కీలక ముందడుగు
  • రూ.25 కోట్లకు పైగా పెట్టుబడులతో పరిశోధనలు, ఆవిష్కరణలకు ప్రోత్సాహం

ఏర్పేడు, ఆంధ్రప్రభ: కియా ఇండియా, భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థ (ఐఐటీ) తిరుపతి మధ్య కొనసాగుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యంలో మరో కీలక మైలురాయిగా ‘ఇన్‌స్పైర్ వర్క్స్ – ది మేకర్స్ ల్యాబ్’ను శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. అత్యాధునిక సాంకేతిక పరికరాలతో ఏర్పాటు చేసిన ఈ ల్యాబ్ విద్యార్థులు, పరిశోధకులు, స్టార్టప్‌లకు ఆవిష్కరణల వేదికగా నిలవనుంది.

ఈ కార్యక్రమంలో కియా ఇండియా చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ తేహ్యూన్ కిమ్, ఐఐటీ తిరుపతి డైరెక్టర్ ప్రొఫెసర్ కే.ఎన్. సత్యనారాయణ సంయుక్తంగా ల్యాబ్ లోగోను ఆవిష్కరించారు. 2025 మే 9న కుదిరిన అవగాహన ఒప్పందానికి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ ల్యాబ్ తొలి దశను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువచ్చారు.

ఈ సందర్భంగా ఐఐటీ తిరుపతి డైరెక్టర్ ప్రొఫెసర్ కే.ఎన్. సత్యనారాయణ మాట్లాడుతూ, ఈ ల్యాబ్ కేవలం ఐఐటీ విద్యార్థులకే కాకుండా పాఠశాల విద్యార్థులు, అధ్యాపకులు, స్టార్టప్‌లు, ప్రాంతీయ ఆవిష్కర్తలకు కూడా ఉపయోగపడే సృజనాత్మక కేంద్రంగా మారుతుందని తెలిపారు. సాంకేతికతను సమాజ అభివృద్ధికి ఉపయోగించే వినూత్న ఆలోచనలకు ఇది ప్రోత్సాహం అందిస్తుందని పేర్కొన్నారు.

కియా ఇండియా సీఏఓ తేహ్యూన్ కిమ్ మాట్లాడుతూ, భవిష్యత్ భారత యువ ఇంజనీర్లు, ఆవిష్కర్తలకు ఈ ల్యాబ్ ఒక లాంచ్‌ప్యాడ్‌గా నిలుస్తుందన్నారు. ఐఐటీ తిరుపతిలో ఐదేళ్ల వ్యవధిలో దాదాపు రూ.25 కోట్లకు పైగా పెట్టుబడి పెడుతున్నట్లు తెలిపారు. ఇందులో ల్యాబ్ ఏర్పాటు, విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలకు ఆర్థిక సహాయం కూడా భాగమని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో కియా ఇండియా సీఎస్‌ఆర్/కార్పొరేట్ అఫైర్స్ హెడ్ జున్హో ఆన్, హెచ్‌ఆర్ స్ట్రాటజీ హెడ్ హాంగ్‌సంగ్ పార్క్, ఐఐటీ తిరుపతి ప్రొఫెసర్లు సురేష్ జైన్, డాక్టర్ డి.వి. కిరణ్, వివిధ విభాగాల అధ్యాపకులు, స్కాలర్‌షిప్ గ్రహీతలు, విద్యార్థులు పాల్గొన్నారు.