వైద్యసేవల నాణ్యతపై ఫోకస్..!

  • ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రత్యేక దృష్టి
  • రోగులకు మెరుగైన వైద్యసేవలే లక్ష్యం
  • పీహెచ్‌సీని తనిఖీ చేసిన డీఎంహెచ్‌వో
  • వైద్య సేవలు మెరుగుపర్చాలని ఆదేశం

పెనుగంచిప్రోలు, ఆంధ్రప్రభ: ప్రభుత్వ వైద్య సేవలు ప్రజలకు నాణ్యంగా, సకాలంలో అందేలా ప్రతి ఆరోగ్య కేంద్రంలో ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని ఎన్టీఆర్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎ. శ్రవణ బాబు సూచించారు. శుక్రవారం పెనుగంచిప్రోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించి వైద్య సేవలపై సమగ్ర తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి, సిబ్బందితో సమావేశమైన డీఎంహెచ్‌వో ఆస్పత్రిలో నిర్వహిస్తున్న వైద్య సేవలు, రికార్డుల నిర్వహణ, నివేదికల నిర్వహణ తీరును సమీక్షించారు. అనంతరం ప్రసూతి గది, ఐఎల్‌ఆర్‌లు (వ్యాక్సిన్ నిల్వ వ్యవస్థ), వ్యాక్సిన్ కోల్డ్ చైన్, ఫార్మసీ, ఇన్‌పేషెంట్ వార్డులను పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులు, వారి సహాయకులతో నేరుగా మాట్లాడి అందుతున్న వైద్య సేవలు, మందుల లభ్యత, సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వైద్య సేవలను మరింత సమర్థవంతంగా అందించాలని సిబ్బందికి సూచించారు. ఈ తనిఖీలో జిల్లా మలేరియా అధికారి శ్రీను నాయక్, డాక్టర్ సునీల్ కుమార్, డాక్టర్ అంకితతో పాటు వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.