సంక్షేమం, అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యం

  • టీడీపీ డోర్‌-టు-డోర్‌కు ప్రజల నుంచి విశేష ఆదరణ
  • మంత్రి రాంప్రసాద్‌రెడ్డి
  • ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలు చేరవేస్తున్న ప్రభుత్వం
  • ఎమ్మెల్యే గద్దె రామమోహన్
  • చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది
  • శాప్ చైర్మన్ ఎ. రవినాయుడు
  • తూర్పు నియోజకవర్గం 4వ డివిజన్‌లో ఇంటింటికీ చేరిన కూటమి ప్రజా ప్రచారం

పటమట , ఆంధ్రప్రభ: ప్రజా సంక్షేమం, సమగ్ర అభివృద్ధి అనే ద్విలక్ష్యాలతో కూటమి ప్రభుత్వం సమర్థవంతమైన పాలన అందిస్తోందని రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామమోహన్, ఏపీ శాప్ చైర్మన్ ఎ. రవినాయుడు పేర్కొన్నారు. శుక్రవారం తూర్పు నియోజకవర్గం 4వ డివిజన్ పరిధిలోని శ్రీనగర్ కాలనీ, యలమంచిలి గౌరంగబాబు రోడ్డులో నిర్వహించిన టీడీపీ డోర్‌-టు-డోర్ కార్యక్రమంలో వారు ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.

ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ ప్రతి వర్గానికీ సంక్షేమ ఫలాలు అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. రెండేళ్ల పాలనలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు నేరుగా వివరించేందుకు డోర్‌-టు-డోర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా కూటమి ప్రభుత్వ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.

ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ, తూర్పు నియోజకవర్గంలో డోర్‌-టు-డోర్ కార్యక్రమానికి ప్రజలు విశేష స్పందన తెలుపుతున్నారని అన్నారు. ప్రతి ఇంటి వద్దకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించడంతో పాటు ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమవుతూ వారి అభిప్రాయాలను తెలుసుకోవడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.

శాప్ చైర్మన్ ఎ. రవినాయుడు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ పాలన అంటేనే సంక్షేమం, అభివృద్ధికి ప్రతీక అని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోందని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగుతోందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జాస్తి సాంబశివరావు, వడ్లపట్ల గోపాలకృష్ణ, మమ్మునేని ప్రసాద్, కోడూరు ఆంజనేయవాసు, చలసాని రమణ, షేక్ షరీఫ్, అనీష్ తదితరులు పాల్గొన్నారు.