ఇంద్రకీలాద్రిపై భక్తి–సంస్కృతి సమ్మేళనం
- ధర్మపథం’లో కూచిపూడి నృత్య వైభవం
- రాజగోపురం కళావేదికపై ఆకట్టుకున్న స్వర్ణలత బృందం ప్రదర్శన
- భక్తి కీర్తనలకు అభినయంతో ప్రాణం పోసిన కళాకారులు
- ఆధ్యాత్మిక ఆనందంలో మునిగిపోయిన భక్తజనం
- కళాకారులను ఘనంగా సత్కరించిన దేవస్థానం అధికారులు
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ధర్మపథం’ సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆధ్యాత్మికానందంలో ముంచెత్తుతున్నాయి. శుక్రవారం సాయంత్రం రాజగోపురం ఎదుట ఏర్పాటు చేసిన కళావేదికపై నిర్వహించిన కూచిపూడి నృత్య ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
విజయవాడకు చెందిన ప్రముఖ నృత్య కళాకారిణి బి. స్వర్ణలత నేతృత్వంలోని బృందం ప్రదర్శించిన నృత్య రూపకాలు భక్తి, సంస్కృతి, సంప్రదాయ కళల సమ్మేళనంగా అలరించాయి. శాస్త్రీయ నృత్యాభినయంతో భక్తిరసాన్ని ఆవిష్కరిస్తూ కళాకారులు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు.
ఈ సందర్భంగా ‘మూషిక వాహన’, ‘జయ జయ’, ‘చక్కని తల్లి’, ‘అంతా రామమయం’, ‘ముద్దుగారే యశోద’, ‘తాండవకృష్ణ’, ‘పలుకే బంగారమాయెనా’, ‘ఇదిగో భద్రాద్రి’, ‘జతి స్వరం’ వంటి భక్తిపూరిత కీర్తనలకు అనుగుణంగా ప్రదర్శించిన నృత్యాలు ఆధ్యాత్మిక భావాన్ని మరింత పరవశింపజేశాయి.
అమ్మవారి దర్శనానికి విచ్చేసిన భక్తులు పెద్ద సంఖ్యలో ఈ సాంస్కృతిక కార్యక్రమాన్ని తిలకించి ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు. సంప్రదాయ కళారూపాల ద్వారా భక్తి సందేశాన్ని అందిస్తున్న దేవస్థానం కార్యక్రమాన్ని పలువురు అభినందించారు.ప్రదర్శన అనంతరం కూచిపూడి కళాకారిణి బి. స్వర్ణలతతో పాటు ఆమె బృంద సభ్యులను దేవస్థానం అధికారులు శాలువాలతో సత్కరించి అభినందించారు. ఇంద్రకీలాద్రిపై నిర్వహిస్తున్న ‘ధర్మపథం’ కార్యక్రమాల ద్వారా భారతీయ సంస్కృతి, శాస్త్రీయ కళలను భక్తులకు చేరువ చేయడంతో పాటు ఆలయ ఆధ్యాత్మిక వైభవాన్ని మరింత విస్తరింపజేస్తున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు.

