హోంగార్డు కుటుంబానికి అండగా ఉంటాం.. ఎస్పీ మహేశ్వరరెడ్డి
శ్రీకాకుళం, ఆగస్టు 7(ఆంధ్రప్రభభ): జిల్లా పోలీసు శాఖలో హోంగార్డుగా విధులు నిర్వహిస్తూ ఇటీవల అనారోగ్య కారణాలతో మృతిచెందిన సువ్వారి నాగరాజు కుటుంబానికి జిల్లా హోంగార్డులు మానవతా దృక్పథంతో అండగా నిలిచారు. విధి నిర్వహణలో మృతి చెందిన, ఉద్యోగ విరమణ పొందిన హోంగార్డుల కుటుంబానికి తమ వంతు సహాయం అందించాలనే ఉద్దేశంతో జిల్లా హోంగార్డులు స్వచ్ఛందంగా తమ ఒక్కరోజు గౌరవ వేతనాన్ని విరాళంగా సేకరించడం జరుగుతోంది.
ఈ మేరకు సేకరించిన సుమారు 4.04 లక్షల రూపాయలు నగదు చెక్కును శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి, మృతిచెందిన హోంగార్డు నాగరాజు తల్లి రూపావతికి అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, విధి నిర్వహణలో సహచరుడిగా ఉన్న నాగరాజు కుటుంబానికి కష్టకాలంలో అండగా నిలిచి, మానవతా దృక్పథంతో స్వచ్ఛందంగా ఒక్కరోజు గౌరవ వేతనాన్ని అందజేసిన జిల్లా హోంగార్డులను అభినందించారు. సహచరుడి కుటుంబానికి తమ కుటుంబ సభ్యులుగా భావించి అండగా నిలవడం పోలీసు శాఖలోని ఐక్యత, మానవత్వానికి నిదర్శనమని కొనియాడారు.నాగరాజు కుటుంబానికి భవిష్యత్తులో కూడా అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు కార్యాలయం సహాయ ఏ.ఓ.,ఎం. సత్యనారాయణ,ఆర్ఐ శంకర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
