Gudivada | హోమియో కళాశాల విద్యార్థిని ఆత్మహత్య..

Gudivada | గుడివాడ – ఆంధ్రప్రభ : గుడివాడలోని ప్రభుత్వ హోమియో మెడికల్ కళాశాలలో విషాద ఘటన చోటుచేసుకుంది. ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని లక్ష్మీ తులసి (28) ప్రైవేట్ హాస్టల్ రూమ్ లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నరసాపురం సమీప గ్రామానికి చెందిన లక్ష్మీ తులసి గుడివాడ గురురాజు ప్రభుత్వ హోమియో మెడికల్ కళాశాలలో చదువుతోంది. ఈ రోజు కాలేజీకి రాకపోవడంతో అనుమానం వచ్చిన సహచర విద్యార్థులు ఆమె ఉంటున్న ప్రైవేట్ హాస్టల్ రూమ్ కు వెళ్లి చూడగా, లక్ష్మీ తులసి ఉరివేలాడుతూ కనిపించింది.

వెంటనే విషయాన్ని కళాశాల ప్రిన్సిపాల్ కు సమాచారం అందించారు. ప్రిన్సిపాల్ పోలీసులకు, లక్ష్మీ తులసి బంధువులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుడివాడ ఏరియా హాస్పిటల్ కు తరలించారు. సమాచారం అందుకున్న లక్ష్మీ తులసి తల్లిదండ్రులు హుటాహుటిన హాస్పిటల్ కు చేరుకున్నారు. కుమార్తె భౌతిక కాయాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనతో హాస్పిటల్ ప్రాంగణం శోకసముద్రమైంది. గుడివాడ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.