పాఠశాల బస్సు బోల్తా.. ఇద్దరు విద్యార్థులకు గాయాలు..
ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ: హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై మండల పరిధిలోని జూపూడి గ్రామం వద్ద శుక్రవారం సాయంత్రం ఓ పాఠశాల బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. పోలీసుల కథనం ప్రకారం కేతనకొండలోని శ్రీ స్వామి నారాయణ్ గురుకుల పాఠశాల బస్సు విద్యార్థులను ఎక్కించుకుని ఇబ్రహీంపట్నం వస్తోంది. మార్గమధ్యలో జూపూడి వద్ద అదుపు తప్పి బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్ధులకు స్వల్ప గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. వెంటనే స్పందించిన స్థానికులు బస్సులో చిక్కుకున్న విద్యార్థులను సురక్షితంగా బయటకు తీశారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో విద్యార్థులు తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పాఠశాల బస్సుల నిర్వహణ, డ్రైవర్ల భద్రతా ప్రమాణాలు, వాహనాల ఫిట్ నెస్ పై ప్రత్యేక దృష్టి సారించాలని స్థానికులు డిమాండ్ చేశారు.
