రెండేళ్లుగా మూలకుపడ్డ చెత్త బండి

తుప్పుపడుతున్న పంచాయతీ వాహనం.. పట్టించుకోని అధికారులు

జైనూర్, ఆంధ్రప్రభ : జైనూర్ మేజర్ గ్రామపంచాయతీకి చెందిన చెత్త సేకరణ వాహనం రెండేళ్లుగా మూలకు పడింది. చెడిపోయిన వాహనానికి మరమ్మతులు చేయించకపోవడంతో హనుమాన్ మందిర్ ఆవరణలో నిరుపయోగంగా ఉండిపోయింది.

వాహనం చుట్టుపక్కల నివాసం ఉంటున్న వారు తమ చెత్తను చెడిపోయి నిలిచిపోయిన వాహనంలో వేస్తున్నారు. దీంతో పరిసరాల్లో దుర్వాసన వస్తోందని స్థానికులు పేర్కొంటున్నారు.

నెలల తరబడి వాహనం మూలకు పడినా పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాహనంలో చెత్తాచెదారం పేరుకుపోవడంతో పరిసరాల్లో అపరిశుభ్రత నెలకొని, దోమలు వృద్ధి చెందే అవకాశం ఉందని చెబుతున్నారు.

వర్షాకాలంలో వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున అధికారులు వెంటనే స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. నిరుపయోగంగా ఉన్న వాహనాన్ని తొలగించడమో, మరమ్మతులు చేయించి పంచాయతీ అవసరాలకు వినియోగించడమో చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.