విడాకులొద్దు..

చెన్నై, ఆంధ్రప్రభ : తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్ దంపతుల వివాహ బంధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. విజయ్ భార్య సంగీత సొర్నలింగం దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌ను శుక్రవారం ఉపసంహరించుకున్నారు. దీంతో, చెంగల్‌పట్టు కుటుంబ న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉన్న విడాకుల కేసు ముగిసింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు విచారణకు హాజరైన సంగీత.. తాను విడాకుల పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు న్యాయస్థానానికి వెల్లడించారు. ఆమె అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న కోర్టు కేసును ముగించింది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో సంగీత.. విజయ్‌తో వివాహ బంధాన్ని రద్దు చేయాలని కోరుతూ చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. ఇద్దరి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయని పేర్కొంటూ విడాకులు మంజూరు చేయాలని కోరారు. ఈ కేసు విచారణ పలుమార్లు వాయిదా పడింది. జూన్ 15న జరిగిన విచారణలోనే సంగీత పిటిషన్‌ను ఉపసంహరించుకునే ఉద్దేశాన్ని కోర్టుకు తెలియజేశారు. ఆ తర్వాత ఆగస్టు 7న తుది విచారణకు వాయిదా వేశారు.

దాదాపు మూడు దశాబ్దాలుగా విజయ్–సంగీత దంపతుల బంధం కొనసాగుతోంది. వీరిద్దరూ 1999 ఆగస్టు 25న చెన్నైలో సంప్రదాయ హిందూ సాంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.

అయితే, 2023 నుంచి విజయ్ దంపతుల మధ్య విభేదాలపై పలు ఊహాగానాలు వెలువడ్డాయి. ముఖ్యంగా సంగీత కొన్ని బహిరంగ కార్యక్రమాలకు హాజరు కాకపోవడంతో చర్చలు జరిగాయి. అయితే ఆ వార్తలను అప్పట్లో ఖండించారు. 2025లో విజయ్ రాజకీయ పార్టీ కార్యక్రమాల్లోనూ ఆమె కనిపించకపోవడంతో మరోసారి అనుమానాలు వ్యక్తమయ్యాయి. తాజాగా విడాకుల పిటిషన్ ఉపసంహరణతో ఈ వివాదానికి తెరపడింది.