100 రోజుల డీజీపీ పాలనపై స్పెషల్ ఫోకస్
రాష్ట్రమంతటా ఇన్స్ పెక్షన్లు.. విజిటింగ్ లు
ఏఐ వినియోగంపై ప్రత్యేక దృష్టి
అవినీతిపై ఉక్కు పాదం
ఫైళ్ళ క్లియరెన్స్ కు మోక్షం
పోలీసుల చేతుల్లో లాఠీలు
హైదరాబాద్, ఆంధ్రప్రభ: రాష్ట్ర పోలీసు శాఖలో బేసిక్ పోలీసింగ్‌ను పునరుద్ధరించడంతో పాటు పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించేందుకు డీజీపీ సీవీ ఆనంద్ చేపట్టిన చర్యలు ఫలితాలు ఇస్తున్నాయి. బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లో పోలీసు వ్యవస్థలో పలు కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. పోలీస్ స్టేషన్ల తనిఖీలు, వాహనాలు, సిబ్బందిపై ఆడిట్, ఏఐ ఆధారిత సేవల విస్తరణ, పారదర్శక బదిలీలు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. పోలీసు శాఖలో తొలిసారిగా వెహికల్ ఆడిట్, ఫోర్స్ ఆడిట్ చేపట్టారు. పదవీ విరమణ చేసిన అధికారులు, ప్రజాప్రతినిధుల వద్ద ఉన్న బుల్లెట్‌ప్రూఫ్ వాహనాలు, అదనపు పోలీసు వాహనాలను వెనక్కి తీసుకున్నారు. అవసరానికి మించి ఉన్న గన్‌మెన్లను విధులకు పంపించారు. గ్రేహౌండ్స్, ఆక్టోపస్ విభాగాల నుంచి కొంతమంది సిబ్బందిని ట్రాఫిక్ నిర్వహణకు వినియోగించేలా చర్యలు తీసుకున్నారు.
ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి
రాష్ట్రంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరోను బలోపేతం చేశారు. ప్రత్యేక సిబ్బందితో ట్రాఫిక్ నియంత్రణ, రోడ్డు భద్రతపై చర్యలు చేపడుతున్నారు. ఏళ్లుగా నిలిచిపోయిన పోలీస్ స్టేషన్ తనిఖీలు, విజిటింగ్‌లను మళ్లీ ప్రారంభించారు. పెండింగ్ ఫైళ్లను వేగంగా పరిష్కరించడంతో పాటు అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండేలా ఆదేశాలు జారీ చేశారు.
ఏఐ టెక్నాలజీ వినియోగం
పోలీసు శాఖలో ఆధునిక సాంకేతికత వినియోగానికి ప్రాధాన్యం ఇస్తూ ‘టి-స్పార్క్’ వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఎఫ్‌ఐఆర్‌లు, చార్జిషీట్లు, ఇతర కేసు వివరాల డిజిటలైజేషన్ చేపడుతున్నారు. అత్యవసర సేవల్లో డయల్-100 స్థానంలో 112 సేవలను మరింత సమర్థంగా అమలు చేస్తున్నారు. అవినీతికి పాల్పడే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ హెచ్చరించారు. ఎస్‌ఐ నుంచి ఉన్నతాధికారుల వరకు పనితీరును 360 డిగ్రీల మూల్యాంకనం చేసే విధానాన్ని అమలు చేస్తున్నారు.
పారదర్శక బదిలీలు
ఇటీవల జరిగిన డీఎస్పీ, ఎస్‌ఐ పోస్టింగుల్లో సిఫారసులకు అవకాశం లేకుండా పారదర్శక విధానాన్ని అమలు చేశారు. లా అండ్ ఆర్డర్ పోస్టింగుల్లోనూ నిబంధనలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. పోలీసు సంక్షేమ అంశాలపై కూడా కొత్త డీజీపీ దృష్టి సారించాలని సిబ్బంది కోరుతున్నారు. పెండింగ్‌లో ఉన్న టీఏ, డీఏ బిల్లులు, జీపీఎఫ్ చెల్లింపులు, పదోన్నతులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ త్వరగా మంజూరు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కొత్త నాయకత్వంలో తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.
