ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి అరెస్టుకు హైకోర్టు ఆదేశాలు
కోర్టు ధిక్కరణ కేసులో బెయిలబుల్ వారెంట్ జారీ
రూ.33.42 కోట్ల నిధుల విడుదలపై ఆదేశాలు అమలు చేయలేదన్న హైకోర్టు ఆగ్రహం
శుక్రవారం ఉదయం 10:30 గంటలకు కోర్టులో హాజరుపర్చాలని పోలీస్ కమిషనర్‌కు ఆదేశం
హైదరాబాద్, ఆంధ్రప్రభ: కోర్టు ధిక్కరణ కేసులో తెలంగాణ ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ సుల్తానియాపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు రూ.33.42 కోట్ల నిధులు విడుదల చేయాలంటూ 2024లో ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడంతో పాటు, ఈ వ్యవహారంలో జారీ చేసిన రెండు నోటీసులకు కూడా స్పందించకపోవడాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది.
ఈ నేపథ్యంలో సందీప్ సుల్తానియాపై బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన న్యాయస్థానం, ఆయన ఎక్కడ ఉన్నా అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపర్చాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌ను ఆదేశించింది.
అలాగే ఈ కేసులో తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ప్రతి విచారణ తేదీన సందీప్ సుల్తానియా వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని హైకోర్టు స్పష్టం చేసింది.
ఈ వ్యవహారం కోర్టు ధిక్కరణ కేసు నేపథ్యంలో చోటుచేసుకున్న పరిణామంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
