వారం రోజులుగా కొనసాగుతున్న పైప్‌లైన్ మరమ్మతులు
మంచిర్యాల ప్రజలకు తీరని తాగునీటి కష్టాలు
నాలుగు యంత్రాలతో పనులు కొనసాగుతున్నాయన్న అధికారులు
మంచిర్యాల, ఆంధ్రప్రభ: మంచిర్యాల పట్టణానికి గోదావరి నది నుంచి మిషన్ భగీరథ ద్వారా తాగునీటిని సరఫరా చేసే ప్రధాన పైప్‌లైన్ గత వారం రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు రాళ్లవాగు వద్ద దెబ్బతినడంతో పట్టణంలో తాగునీటి సరఫరా నిలిచిపోయింది. రంగపేట–లక్ష్మీనగర్ మధ్య ఉన్న ప్రాంతంలో పైప్‌లైన్ కొట్టుకుపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పైప్‌లైన్ పునరుద్ధరణ పనులు ఆలస్యమవుతున్నాయని స్థానికులు, ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. గతంలో ఇదే తరహా పరిస్థితుల్లో తక్కువ సమయంలోనే నీటి సరఫరా పునరుద్ధరించారని, ప్రస్తుతం మాత్రం వారం రోజులు గడిచినా సమస్య పరిష్కారం కాలేదని విమర్శిస్తున్నారు.
ఈ విషయంపై ఆంధ్రప్రభ మున్సిపల్ కమిషనర్, నగర మేయర్‌ను వివరణ కోరగా, నాలుగు యంత్రాలతో మరమ్మతు పనులు కొనసాగుతున్నాయని, వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసి తాగునీటి సరఫరాను పునరుద్ధరిస్తామని తెలిపారు. అయితే రెండు రోజుల్లో పనులు పూర్తవుతాయని చెప్పినప్పటికీ ఇప్పటికీ నీటి సరఫరా ప్రారంభం కాకపోవడంతో పట్టణ ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
