గాంధారి ఖిల్లాలో తప్పిపోయిన వృద్ధురాలు.. సీసీ కెమెరాలతో గుర్తించిన పోలీసులు

క్యాతన్‌పల్లి, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గాంధారి ఖిల్లాకు మొక్కులు తీర్చుకునేందుకు వచ్చిన ఓ వృద్ధురాలు తప్పిపోవడంతో కలకలం రేగింది. పోలీసులు, అటవీ శాఖ అధికారులు సమన్వయంతో గాలింపు చేపట్టి ఆమెను సురక్షితంగా గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాంధారి ఖిల్లా గ్రామానికి చెందిన గంగవ్వ గురువారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి గాంధారి ఖిల్లాకు మొక్కులు తీర్చుకునేందుకు వచ్చారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యుల నుంచి విడిపోయి కనిపించకుండా పోయారు.

విషయం తెలుసుకున్న వెంటనే రామకృష్ణాపూర్ పోలీసులు, అటవీ శాఖ అధికారులు సంయుక్తంగా గాలింపు చర్యలు ప్రారంభించారు. రాత్రి 8 గంటల సమయంలో ఏసీసీ క్వారీ సఫారీ రూట్ పరిసరాల్లో ఏర్పాటు చేసిన అటవీ శాఖ నిఘా కెమెరాల దృశ్యాలను పరిశీలించగా, గంగవ్వ అడవి ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు.

వెంటనే పోలీసులు, అటవీ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని గంగవ్వను సురక్షితంగా రక్షించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ గాలింపు చర్యల్లో ఎస్‌ఐ జాడి శ్రీధర్‌, హెడ్ కానిస్టేబుల్ జంగు, కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు, మహిళా కానిస్టేబుల్‌తో పాటు అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు.