సీఎం చంద్రబాబు పర్యటనకు.. కలిదిండిలో ముమ్మర ఏర్పాట్లు..

సభాస్థలి, హెలిప్యాడ్ పరిశీలించిన ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్


కలిదిండి, ఆగస్టు 6(ఆంధ్రప్రభ): ఈనెల 10వ తేదీన కలిదిండి మండలంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన, బహిరంగ సభ విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అస్యూరెన్స్ కమిటీ చైర్మన్, కైకలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్ గురువారం ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్, ఆర్‌డీవో తదితర అధికారులతో కలిసి కలిదిండి మండలం కాళ్లపాలెం గ్రామంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.

సమావేశంలో సీఎం పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లపై అధికారులతో సమగ్రంగా చర్చించారు. అనంతరం సభాస్థలి, హెలిప్యాడ్, వాహనాల పార్కింగ్ ప్రాంతాలు, ఫుడ్ కౌంటర్లు, ప్రజల రాకపోకల ఏర్పాట్లు, భద్రత, ఇతర మౌలిక సదుపాయాలకు సంబంధించిన స్థలాలను పరిశీలించి అధికారులకు తగిన సూచనలు చేశారు. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతంగా జరిగేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.