కడెం ప్రాజెక్టు నుంచి వెంటనే సాగునీరు విడుదల చేయాలి

రైతుల ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలి: విజిత్ రావు

దండేపల్లి, ఆంధ్రప్రభ : కడెం ప్రాజెక్టు పరిధిలోని రైతుల సాగు అవసరాలను దృష్టిలో ఉంచుకుని వెంటనే కాలువలకు సాగునీటిని విడుదల చేయాలని బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు విజిత్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దండేపల్లి మండల కేంద్రంలోని పద్మశాలి భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ ఏడాది వర్షాలు ఆలస్యంగా కురవడంతో రైతులు ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

కడెం ప్రాజెక్టులో తగినంత నీటి నిల్వలు ఉన్న నేపథ్యంలో రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఎడమ, కుడి కాలువల ద్వారా సాగునీటిని విడుదల చేయాలని కోరారు. దండేపల్లి, జన్నారం, లక్షెట్టిపేట తదితర మండలాల రైతులు నాట్లు వేసేందుకు, పంటలను కాపాడుకునేందుకు సాగునీరు అత్యవసరమని పేర్కొన్నారు.

కడెం ప్రాజెక్టు ఆయకట్టు రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే గుర్తించి సాగునీటి విడుదలపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వ్యవసాయమే ప్రధాన ఆధారంగా జీవిస్తున్న వేలాది మంది రైతుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆలస్యం చేయకుండా సాగునీటిని విడుదల చేస్తే రైతాంగానికి మేలు జరుగుతుందని విజిత్ రావు అన్నారు.

రైతుల పక్షాన ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ డీసీఎంఎస్ చైర్మన్లు కేతిరెడ్డి శ్రీనివాస్, తిప్పని లింగన్న, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు చుంచు శ్రీనివాస్, మాజీ వైస్ ఎంపీపీ పసార్తి అనిల్ కుమార్, పీఏసీఎస్ చైర్మన్ కాసనగొట్టు లింగన్న, నాయకులు ఆశెట్టి రమణ, పురేళ్ల లక్ష్మణ్, బొలిశెట్టి లింగారెడ్డి, గొట్ల భూమన్న, అల్లంల సంతోష్, పత్తిపాక శ్రీనివాస్, పొడేటి శ్రీనివాస్, ఇప్ప సాయి కుమార్, నజీర్, ముద్దసాని తిరుపతి, రవికుమార్, పిట్టల రాజన్న, సిపతి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.