పెద్ది సుదర్శన్‌రెడ్డికి ఘన నివాళి

ఆశయ సాధనకు కార్యకర్తలు ఐక్యంగా ముందుకు సాగాలి: నన్నపనేని నరేందర్

నర్సంపేట, ఆంధ్రప్రభ: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా తెలంగాణ ఉద్యమ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ పెద్ది సుదర్శన్‌రెడ్డి చిత్రపటానికి వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ గురువారం పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెద్ది సుదర్శన్‌రెడ్డి ప్రజాసేవకు జీవితాంతం అంకితభావంతో పనిచేసిన గొప్ప నాయకుడని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆయన పోషించిన పాత్ర చిరస్మరణీయమని, బీఆర్‌ఎస్ పార్టీ బలోపేతానికి అందించిన సేవలు ఎన్నటికీ మరువలేనివని పేర్కొన్నారు.

ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడిన ప్రజానాయకుడిగా ఆయన ఎప్పటికీ ప్రజల హృదయాల్లో నిలిచిపోతారని అన్నారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి మరణం బీఆర్‌ఎస్ పార్టీకి, తెలంగాణ ఉద్యమానికి, ఉమ్మడి వరంగల్ జిల్లాకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆయన లేరనే విషయాన్ని జీర్ణించుకోవడం కష్టమే అయినప్పటికీ, కార్యకర్తలు అధైర్యపడకుండా ఆయన ఆశయాల సాధన కోసం ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. నర్సంపేట నియోజకవర్గంలోని ప్రతి గ్రామం, ప్రతి పల్లె, మున్సిపాలిటీ ప్రాంతాల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు.

నర్సంపేటకు ప్రభుత్వ మెడికల్ కళాశాల తీసుకురావడంలో పెద్ది సుదర్శన్‌రెడ్డి కీలక పాత్ర పోషించారని, ఆ అభివృద్ధి ఆయన దూరదృష్టికి నిదర్శనమని తెలిపారు. తాను 2009 నుంచి దాదాపు 17 సంవత్సరాల పాటు ఆయనతో కలిసి రాజకీయ ప్రయాణం చేశానని, ఆయన నాయకత్వం నుంచి ఎంతో నేర్చుకున్నానని పేర్కొన్నారు.

ఈ నెల నిర్వహించనున్న పెద్ది సుదర్శన్‌రెడ్డి దశదిన కార్యక్రమానికి పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్దఎత్తున హాజరై విజయవంతం చేయాలని నన్నపనేని నరేందర్ పిలుపునిచ్చారు.

అనంతరం నర్సంపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల ఎదుట ఏర్పాటు చేయనున్న స్వర్గీయ పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహానికి భూమిపూజ నిర్వహించి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమకారుడైన పెద్ది సుదర్శన్‌రెడ్డి జ్ఞాపకార్థం ఆయన కృషితో ఏర్పాటైన ప్రభుత్వ మెడికల్ కళాశాల ఎదుటే విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందాలనే సంకల్పంతో, గ్రామీణ విద్యార్థులు వైద్యులుగా ఎదగాలనే ఆశయంతో ఆయన నర్సంపేటకు ప్రభుత్వ మెడికల్ కళాశాలను సాధించారని గుర్తు చేశారు.

అలాంటి మహనీయుడి విగ్రహాన్ని అదే కళాశాల ముందు ప్రతిష్ఠించడం ఆయనకు నిజమైన నివాళిగా నిలుస్తుందని పేర్కొన్నారు. విగ్రహ ఏర్పాటుకు ముందుకు వచ్చిన డాక్టర్ లెక్కల విద్యాసాగర్‌రెడ్డిని నన్నపనేని నరేందర్ అభినందించారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కోఆర్డినేటర్, ఆర్‌ఎస్‌ఎస్ రాష్ట్ర మాజీ డైరెక్టర్, పట్టణ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ మాజీ డైరెక్టర్, క్లస్టర్ బాధ్యులు, పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి, బీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు, మున్సిపల్ కౌన్సిలర్లు, వార్డు అధ్యక్షులు, మాజీ కౌన్సిలర్ అభ్యర్థులు, మహిళా విభాగం నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.