ఉపసర్పంచ్‌ల హక్కుల సాధనకు ఐక్య పోరాటం

రూ.5 వేల గౌరవ వేతనం, శిలాఫలకాలపై పేర్లకు గుర్తింపు ఇవ్వాలి: బొట్ల కార్తీక్

అచ్చంపేట, ఆంధ్రప్రభ: గ్రామాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ఉపసర్పంచ్‌లకు తగిన గుర్తింపు, హక్కులు కల్పించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఉపసర్పంచ్‌ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బొట్ల కార్తీక్ స్పష్టం చేశారు. తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రవ్యాప్తంగా ఉపసర్పంచ్‌లు ఐక్యంగా పోరాటం సాగించాలని ఆయన పిలుపునిచ్చారు.

అచ్చంపేట పట్టణంలోని సామ్స్ ఫంక్షన్ హాల్‌లో గురువారం ఉపసర్పంచ్‌ల ఫోరం అచ్చంపేట నియోజకవర్గ అధ్యక్షుడు మాదంశెట్టి తిరుపతయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో బొట్ల కార్తీక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమావేశానికి ముందు జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా బొట్ల కార్తీక్ మాట్లాడుతూ, గ్రామ పంచాయతీల్లో ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యులు ప్రజలకు నిరంతరం సేవలందిస్తున్నప్పటికీ వారికి తగిన గౌరవం, ప్రోత్సాహం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపసర్పంచ్‌లకు నెలకు రూ.5 వేల గౌరవ వేతనం, వార్డు సభ్యులకు రూ.3 వేల గౌరవ వేతనం వెంటనే ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

గ్రామాల్లో ప్రభుత్వ నిధులతో చేపట్టే అభివృద్ధి పనుల శిలాఫలకాలపై సర్పంచ్‌తో పాటు ఉపసర్పంచ్ పేరు కూడా తప్పనిసరిగా పొందుపరచాలని కోరారు. స్థానిక సంస్థలను బలోపేతం చేయాలంటే ఉపసర్పంచ్‌లకు స్పష్టమైన అధికారాలు, గౌరవప్రదమైన గుర్తింపు కల్పించడం అవసరమని పేర్కొన్నారు.

హక్కుల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉపసర్పంచ్‌లు ఐక్యంగా పనిచేయాలని, అవసరమైతే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

సమావేశంలో గ్రామ పంచాయతీల్లో ఎదురవుతున్న పరిపాలనా సమస్యలు, ఉపసర్పంచ్‌ల హక్కులు, స్థానిక సంస్థల బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు. వివిధ మండలాల నుంచి వచ్చిన ఉపసర్పంచ్‌లు తమ సమస్యలను రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ల ఫోరం నాగర్‌కర్నూలు జిల్లా అధ్యక్షుడు వారణాసి శ్రీనివాసులు, వర్కింగ్ ప్రెసిడెంట్ జలీల్, అచ్చంపేట తాలూకా గౌరవ అధ్యక్షుడు వరికుప్పల నిరంజన్, తాలూకా మండల అధ్యక్షులు బొల్లంపల్లి రమేష్, వీరస్వామి, నరసింహ, భాస్కర్‌తో పాటు అచ్చంపేట నియోజకవర్గంలోని వివిధ మండలాలు, గ్రామాలకు చెందిన ఉపసర్పంచ్‌లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.