పేదలకోసమే ఉచిత వైద్య సేవలతో పాటు మందులు కూడా..

ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి
అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న వారికి ఉచిత వైద్యసేవలతో భరోసా…


ఏలూరు, ఆగస్టు 6, ఆంధ్రప్రభ : అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న వారికి ఉచిత వైద్యసేవలతో కూడిన భరోసా కల్పించాలనే స్ఫూర్తివంతమైన లక్ష్యంతో ముందడుగు వేసినట్లు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి వ్యాఖ్యానించారు. అందుకు దాతల సహకారం ఎంతో ప్రశంసనీయమని ఆయన అభినందించారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని పేద ప్రజలకు, అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి స్థానిక పవర్ పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద స్వాంతన చేకూరుతోంది.

ప్రతి గురువారం ఇక్కడ నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరానికి అవసరార్థుల నుండి అనూహ్య స్పందన లభిస్తోంది. ఇదే క్రమంలో ఈ వారం కూడా నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి పెద్ద సంఖ్యలో ప్రజలు విచ్చేసి వైద్య సేవలను సద్వినియోగం చేసుకున్నారు. ఈ క్రమంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహణ తీరును పరిశీలించిన జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి వైద్య సేవల కోసం విచ్చేసిన వారికి భరోసా కల్పించారు. ఉచితంగా మందులను పంపిణీ చేశారు. అలాగే నాణ్యమైన వైద్య సేవలు అందించాలంటూ వైద్యులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ…. ఏలూరు నియోజకవర్గంలో ఆరోగ్యపరంగా ఇబ్బందిపడుతున్న పేదలకు ఉచిత వైద్య సేవలతో పాటు మందులు అందించాలనే సదుద్దేశంతో ప్రతి గురువారం క్యాంప్ కార్యాలయంలో ఒక గొప్ప సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ స్పూర్తిదాయకమైన కార్యక్రమాన్ని చూసి పలువురు దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అవసరార్థులకు సరిపడే మందులను అందిస్తూ వస్తున్నారన్నారు. అలాగే తాను లయన్స్ క్లబ్ సభ్యునిగా ఉండటం వల్ల ఇటీవల జరిగిన కొత్త కమిటీ ప్రమాణ స్వీకార వేడుకలో ఈ సేవా కార్యక్రమం గురించి తోటి సభ్యులతో పంచుకోవడం జరిగిందన్నారు.

ఆ సందర్భంలోనే లయన్స్ క్లబ్ సభ్యులు వేమా రాము దాతృత్వంతో స్పందించి నెల రోజులకు సరిపడా మందులను ఉచితంగా అందిస్తానని హామీ ఇచ్చి దాన్ని ఈ వారం నెరవేర్చారని ఆయన ప్రశంసించారు. ఇదే మాదిరిగా మరింత మంది దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఉచిత వైద్య సేవలకు అవసరమైన సహకారాన్ని అందించాలంటూ ఎమ్మెల్యే బడేటి చంటి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారథి, టిడిపి నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, కార్యదర్శి రెడ్డి నాగరాజు, టిడిపి సీనియర్ నాయకులు బెల్లపుకొండ కిషోర్, పలువురు లయన్స్ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు.