డీఎస్సీ అక్రమాలపై కదిరిలో వైఎస్సార్సీపీ నిరసన
రిలే నిరాహార దీక్షల్లో పాల్గొన్న పార్టీ నేతలు
లోకేష్ రాజీనామా, సమగ్ర విచారణకు డిమాండ్
కదిరి రూరల్, ఆంధ్రప్రభ: డీఎస్సీ నియామక ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, వాటిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కదిరిలో వైఎస్సార్సీపీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో గురువారం రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. రాష్ట్ర వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు, కదిరి వైఎస్సార్సీపీ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ ఆదేశాలతో ఈ ఆందోళన చేపట్టినట్లు నాయకులు తెలిపారు.
దీక్షలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ డీఎస్సీ నియామక ప్రక్రియలో పారదర్శకత లేకుండా అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సీబీఐ లేదా స్వతంత్ర సంస్థతో సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు వెలికితీయాలని, నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేసి, నియామక ప్రక్రియను పూర్తిస్థాయి పారదర్శకతతో నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ విద్యార్థి, యువజన విభాగాల నాయకులతో పాటు టౌన్, మండల కన్వీనర్లు, రాష్ట్ర, జిల్లా నాయకులు, మహిళా విభాగం ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని సంఘీభావం తెలిపారు.
