మున్నేరు వంతెన వద్ద కారు అదుపుతప్పి బోల్తా..
తల్లి, కుమారుడు మృతి.. డ్రైవర్ పరిస్థితి విషమం
ఖమ్మం ఆంధ్రప్రభ : ఖమ్మం జిల్లాలోని గ్రీన్‌ఫీల్డ్ హైవేపై గురువారం విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దంసలాపురం సమీపంలోని మున్నేరు వంతెన వద్ద జరిగిన ఈ ప్రమాదంలో తల్లి, కుమారుడు అక్కడికక్కడే మృతిచెందగా, కారు నడుపుతున్న వ్యక్తి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ప్రమాదంలో మృతిచెందిన వారిని చింతకాని మండలం గాంధీనగర్ గ్రామానికి చెందిన పోకబత్తిని నర్సింహారావు, సుజాతగా గుర్తించారు. ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, వాహనం నడుపుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేశారు. ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఈ ప్రమాదంతో గాంధీనగర్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో గ్రామస్థులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
