ఆశ్రమ బాలికల పాఠశాలలో ఆకస్మిక తనిఖీ

గూడూరు (ఆంధ్రప్రభ): మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలను జిల్లా గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ దేశరాం నాయక్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాల పరిశుభ్రత, విద్యార్థినులకు అందిస్తున్న అల్పాహారం, కామన్ మెనూ అమలును పరిశీలించారు. విద్యార్థినులతో నేరుగా మాట్లాడి భోజన నాణ్యతపై ఆరా తీశారు. అనంతరం స్టోర్‌రూమ్‌తో పాటు పాఠశాల నిర్వహణకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేశారు.

అసెంబ్లీలో పాల్గొన్న ఆయన సమయపాలన పాటించని ఉపాధ్యాయులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. పాఠశాల పరిసరాల పరిశుభ్రత సరిగా లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థినులకు కామన్ మెనూ ప్రకారం భోజనం అందించకపోతే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. తనిఖీ నివేదికను జిల్లా కలెక్టర్‌కు అందజేస్తామని, డిప్యూటీ వార్డెన్‌తో పాటు మరో ఉపాధ్యాయురాలిపై చర్యలకు సిఫారసు చేస్తామని తెలిపారు.