అర్ధరాత్రి తనిఖీల్లో అక్రమ మద్యం పట్టివేత
నలుగురు యువకుల అరెస్ట్.. మద్యం బాటిళ్లు, కారు స్వాధీనం
అక్రమ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపిన నూతన డీఎస్పీ
పుట్టపర్తి (ఆంధ్రప్రభ): శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి సబ్‌డివిజన్‌లో చట్టవిరుద్ధ కార్యకలాపాలపై నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డీఎస్పీ సత్యనారాయణ ఉక్కుపాదం మోపారు. బుధవారం అర్థరాత్రి స్వయంగా సిబ్బందితో కలిసి చిత్రావతి రోడ్డులో ఆకస్మిక వాహన తనిఖీలు నిర్వహించారు. రాత్రి ఒంటి గంట నుంచి 2.30 గంటల వరకు కొనసాగిన తనిఖీల్లో అక్రమంగా మద్యం తరలిస్తున్న కారును గుర్తించి నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు.
నిందితుల వద్ద నుంచి కారుతో పాటు మొత్తం 18 మద్యం, బీర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 750 ఎంఎల్ మాన్షన్ హౌస్ బ్రాందీ నాలుగు బాటిళ్లు, 360 ఎంఎల్ మాన్షన్ హౌస్ బ్రాందీ రెండు బాటిళ్లు, ఓల్డ్ అడ్మిరల్ క్వార్టర్ నాలుగు బాటిళ్లు, కింగ్‌ఫిషర్ బీర్ ఎనిమిది బాటిళ్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. డీఎస్పీ ఆదేశాల మేరకు నిందితులపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా డీఎస్పీ సత్యనారాయణ మాట్లాడుతూ పుట్టపర్తి సబ్‌డివిజన్ పరిధిలో అక్రమ మద్యం రవాణా, గంజాయి, మాదకద్రవ్యాల విక్రయాలు, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలపై నిరంతర నిఘా కొనసాగుతుందని స్పష్టం చేశారు. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు కూడా అక్రమ కార్యకలాపాలపై పోలీసులకు సమాచారం అందించి శాంతిభద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు.
