హారతి అంతరార్థం.. దివ్యత్వాన్ని మనలోనే దర్శించుకునే ఆధ్యాత్మిక సందేశం
హారతి అంతరార్థం.. దివ్యత్వాన్ని మనలోనే దర్శించుకునే ఆధ్యాత్మిక సందేశం
- హారతి వెనుక దాగిన ఆధ్యాత్మిక భావం
- గురువు చూపే జ్ఞానజ్యోతి
- హారతి వెలుగులో పరమాత్మ తత్వం
- వేదాంతం చెప్పే హారతి మహిమ
- దివ్యత్వాన్ని మనలోనే అనుభవించే మార్గం
తరచూ మనము ప్రకాశింపచేసే భగవంతుణ్ణి చూడడానికి చాలాసేపు వేచి ఉంటాము. కానీ మనలోపల చూసుకోవడానికా అన్నట్లు హారతి ఇచ్చే అసలు సమయానికి అయాచితంగా కళ్ళు మూత పడతాయి. మన దేహము దేవుని ఆలయమునీ, లోపల దివ్యత్వాన్ని కలిగి ఉన్నామని ఈ విధంగా కళ్ళు మూయడం సూచిస్తుంది.
పూజారి హారతి వెలుగులో భగవంతుడిని స్పష్టంగా చూపించినట్లుగానే, గురువుగారు కూడా జ్ఞానమనే వెలుగు సహాయముతో ప్రతి ఒక్కరిలోనున్న దివ్యత్వాన్ని స్పష్టంగా తెలియపరుస్తారు.
హారతి చివరిలో దానిపై చేతులుంచి, తరువాత కళ్ళకి, తలపై భాగానికి అడ్డుకోవడమంటే అర్థము – భగవంతుడిని ప్రకాశింపజేసిన ఈ వెలుగు నా దృష్టిని వెలిగించుగాక! నా దృష్టి పవిత్రమగుగాక! నా ఆలోచనలు ఉన్నతముగాను, మంచివిగాను ఉండుగాక! అని ప్రార్థించడం.
హారతికి వేదాంతపరమైన అర్థము – సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, విద్యుత్ మరియు అగ్ని… ఇవి వెలుగుకి సహజమైన మూల కారణములు. సృష్టిలోని అద్భుతమైన, అపూర్వమైన వాటన్నింటికి భగవంతుడు ఆధారము. ఆయన కారణముగానే మిగిలినవి ఏవైనా ఉండటం మరియు ప్రకాశించడం జరుగుతుంది.
హారతి వెలుగులో భగవంతుడిని ప్రకాశింప చేసినప్పుడు మన దృష్టిని అన్ని వెలుగులకు మూల కారణము మరియు జ్ఞానాన్ని, జీవితాన్ని సూచించే పరమాత్మ వైపు మళ్లిస్తాము.
సూర్యుడు బుద్ధికి, చంద్రుడు మనసుకి, అగ్ని వాక్కుకీ అధిదేవతలు. భగవంతుడు వీటన్నింటిని వెలిగించే అత్యున్నతమైన చైతన్యము. అతను లేకుండా బుద్ధి ఆలోచించలేదు. మనసు భావింపలేదు. నాలుక మాట్లాడలేదు. మనసు, బుద్ధి మరియు వాక్కులకీ వెనుక ఉన్నదీ భగవంతుడే.
ఈ పరిమితమైన ఉపకరణాలు ఆ అపరిమితమైన భగవంతుడిని ఏ విధముగా ప్రకాశింపజేయగలవు? అందుకే హారతి ఇచ్చేటప్పుడు మనము ఈ క్రింది విధముగా స్తుతిస్తాము.
న తత్ర సూర్యో భాతి న చంద్ర తారకం
నేమా విద్యుతో భ్రాంతి కుతో యమగ్నిః
తమేవ భాంతమనుభాతి సర్వం
తస్యభాసా సర్వమిదం విభాతి
సూర్యుడు ప్రకాశించని చోట, చంద్రుడు, నక్షత్రాలు, విద్యుత్ ప్రకాశించని చోట, ఆయన ఉన్నాడు. మరి ఈ చిన్ని జ్యోతి (నా చేతిలో ఉన్నది) ఏమి చేయగలదు?
ప్రతిదీ ఆయన వలననే ప్రకాశిస్తాయి.
ఆయన వెలుగు వలన మాత్రమే
మనమంతా ప్రకాశింపబడుతున్నాము.
