తల్లిపాలను ఎందుకు ‘అమృతం’ అంటారో తెలుసా?
మొదటి గంటే కీలకం… తల్లిపాలతోనే ఆరోగ్యానికి శ్రీకారం
(ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు: ఆగస్టు 1–7)
తల్లిపాల వారోత్సవాలు ఎందుకు?
పుట్టిన ప్రతి బిడ్డకు ఆరోగ్యవంతమైన జీవితాన్ని అందించే తొలి అడుగు తల్లిపాలే. శిశువుకు సంపూర్ణ పోషకాహారం అందించడమే కాకుండా, తల్లి ఆరోగ్యాన్ని కూడా కాపాడడంలో తల్లిపాలు కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే ప్రతి ఏడాది ఆగస్టు 1 నుంచి 7 వరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), యునిసెఫ్ ఆధ్వర్యంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడం, పుట్టిన గంటలోపే పాలివ్వడం, తొలి ఆరు నెలలు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని ప్రోత్సహించడం ఈ వారోత్సవాల ప్రధాన ఉద్దేశం.
మొదటి గంటే కీలకం… ముర్రుపాలే తొలి టీకా
పుట్టిన గంటలోపే బిడ్డకు తల్లిపాలు పట్టించడం అత్యంత అవసరం. తొలి రెండు మూడు రోజుల్లో వచ్చే చిక్కటి పసుపు రంగు పాలను ముర్రుపాలు (కొలాస్ట్రం) అంటారు. ఇవి బిడ్డకు తొలి వ్యాధి నిరోధక టీకాలా పనిచేస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచి, అనేక అంటువ్యాధుల నుంచి రక్షిస్తాయి. సిజేరియన్ అయినా, సాధారణ ప్రసవమైనా వీలైనంత త్వరగా పాలివ్వడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
ఆరు నెలలు… తల్లిపాలే చాలు
పుట్టినప్పటి నుంచి ఆరు నెలల వరకు బిడ్డకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. ఈ దశలో నీళ్లు, తేనె, గ్లూకోజ్ నీరు, ఆవు లేదా గేదె పాలు, ఇతర ద్రవాలు అవసరం ఉండవు. తల్లిపాల్లోనే బిడ్డ ఎదుగుదలకు కావాల్సిన అన్ని పోషకాలు, తగినంత నీరు ఉంటాయి. ఆరు నెలల తర్వాత అదనపు ఆహారం ప్రారంభించినా, రెండేళ్ల వరకు లేదా అంతకంటే ఎక్కువ కాలం తల్లిపాలు కొనసాగించడం మంచిది.
బిడ్డకు తల్లిపాల వల్ల కలిగే ప్రయోజనాలు
తల్లిపాలు తేలికగా జీర్ణమవుతాయి. విరేచనాలు, న్యూమోనియా, అలర్జీలు, ఆస్తమా వంటి వ్యాధుల ముప్పు తగ్గుతుంది. దవడల ఎదుగుదల బాగుంటుంది. శారీరక, మానసిక వికాసానికి తోడ్పడటమే కాకుండా, శిశు మరణాల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయని వైద్య అధ్యయనాలు సూచిస్తున్నాయి.
తల్లికీ ఆరోగ్య రక్షణే
తల్లిపాలు ఇవ్వడం వల్ల ప్రసవం అనంతరం గర్భాశయం త్వరగా సాధారణ స్థితికి చేరుతుంది. రక్తస్రావం తగ్గుతుంది. రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ల ప్రమాదం తగ్గే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తల్లి–బిడ్డల మధ్య భావోద్వేగ అనుబంధం మరింత బలపడుతుంది.
ఉద్యోగినులూ తల్లిపాలు కొనసాగించవచ్చు
ప్రసూతి ప్రయోజనాల చట్టం ప్రకారం అనేక రంగాల్లో పనిచేసే మహిళలకు 26 వారాల ప్రసూతి సెలవు లభిస్తోంది. అవసరమైతే తల్లిపాలను పరిశుభ్రంగా పిండి నిల్వ చేసి బిడ్డకు ఇవ్వవచ్చు. పాలిచ్చే తల్లులు తగినంత నీరు తాగుతూ, పాలు, గుడ్లు, పప్పులు, ఆకుకూరలు, పండ్లు వంటి పోషకాహారం తీసుకోవడం అవసరం.
తల్లిపాలు బిడ్డ ఆకలి తీర్చే ఆహారం మాత్రమే కాదు… జీవితాంతం ఆరోగ్యానికి వేసే తొలి పునాది. ప్రతి తల్లి తల్లిపాల ప్రాముఖ్యతను తెలుసుకుని, ప్రతి కుటుంబం ఆమెకు అండగా నిలిస్తేనే ఆరోగ్యవంతమైన భావితరాలను నిర్మించగలం.
నాశబోయిన నరసింహ (నాన)
కవి, రచయిత, ఆరోగ్య విస్తరణ అధికారి
