శ్రీశైలానికి ఉప్పొంగుతున్న కృష్ణమ్మ..

  • ఎగువ నుంచి భారీ వరద..
  • శ్రీశైలంలో పెరుగుతున్న నిల్వలు
  • ఆల్మట్టి, జూరాల నుంచి భారీ నీటి విడుదల
  • 1.31 లక్షల క్యూసెక్కులతో వరద ప్రవాహం

కర్నూలు రూరల్ బ్యూరో, ఆంధ్రప్రభ : కృష్ణా పరీవాహక ప్రాంతంలో వరద ప్రవాహం కొనసాగుతుండటంతో ఎగువ జలాశయాల నుంచి భారీగా నీటి విడుదల కొనసాగుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టుల నుంచి లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వదులుతుండగా, శ్రీశైలం జలాశయానికి శుక్రవారం సాయంత్రం నాటికి 1.31 లక్షల క్యూసెక్కుల వరద చేరుతోంది. దీంతో శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు క్రమంగా పెరుగుతున్నాయి.

కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టుల నుంచి భారీగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుండగా, జలాశయంలో నీటి నిల్వలు క్రమంగా పెరుగుతున్నాయి.

ఆల్మట్టి ప్రాజెక్టులో శుక్రవారం సాయంత్రం 6 గంటల నాటికి నీటిమట్టం 519.06 మీటర్లు నమోదైంది. గత 10 గంటల సగటు ఇన్‌ఫ్లో 91,945 క్యూసెక్కులు కాగా, సగటు అవుట్‌ఫ్లో 1,10,000 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుతం కూడా నదికి 1,10,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో 113.92 టీఎంసీల స్థూల నీటి నిల్వ (92.55 శాతం), 96.30 టీఎంసీల ప్రత్యక్ష నీటి నిల్వ నమోదైంది.

నారాయణపూర్ ప్రాజెక్టులో నీటిమట్టం 491.41 మీటర్లు ఉంది. ప్రస్తుతం 1,10,000 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తుండగా, 29 గేట్లు, విద్యుత్ కేంద్రం ద్వారా మొత్తం 1,05,474 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో 29.53 టీఎంసీల స్థూల నీటి నిల్వ (88.64 శాతం), 14.77 టీఎంసీల ప్రత్యక్ష నిల్వ ఉంది.

జూరాల ప్రాజెక్టులో నీటిమట్టం 317.69 మీటర్లుగా నమోదైంది. ప్రస్తుతం 1,22,000 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తుండగా, 1,35,889 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇందులో 24 గేట్ల ద్వారా 95,592 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా 35,502 క్యూసెక్కులు విడుదల అవుతున్నాయి. ప్రాజెక్టులో 8.01 టీఎంసీల స్థూల నీటి నిల్వ, 4.303 టీఎంసీల ప్రత్యక్ష నీటి నిల్వ ఉంది.

శ్రీశైలం జలాశయంలో పూర్తి స్థాయి నీటిమట్టం 269.750 మీటర్లు (885 అడుగులు) కాగా, ప్రస్తుతం నీటిమట్టం 254.325 మీటర్లు (834.40 అడుగులు)కు చేరుకుంది. జలాశయంలో 54.3495 టీఎంసీల స్థూల నీటి నిల్వ నమోదైంది.

శ్రీశైలానికి మొత్తం 1,31,094 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తోంది. ఇందులో జూరాల విద్యుత్ కేంద్రం నుంచి 35,502 క్యూసెక్కులు, జూరాల స్పిల్‌వే ద్వారా 95,592 క్యూసెక్కులు చేరుతున్నాయి. సుంకేసుల, హంద్రీ నదుల నుంచి ప్రస్తుతం ఎలాంటి ప్రవాహం లేదు. తక్షణ వాస్తవ ప్రవాహం 92,709 క్యూసెక్కులుగా అధికారులు వెల్లడించారు.