భారత్‌లో ‘లుమారా’ ప్రారంభించిన బ్రూక్‌ఫీల్డ్

ముంబై, ఆంధ్రప్రభ : ప్రపంచ ప్రముఖ పెట్టుబడి సంస్థ బ్రూక్‌ఫీల్డ్ భారతదేశంలో ‘లుమారా’ పేరుతో కొత్త పునరుత్పాదక ఇంధన వేదికను ప్రారంభించింది. దేశంలో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల అభివృద్ధి, నిర్మాణాన్ని వేగవంతం చేయడమే ఈ వేదిక ప్రధాన లక్ష్యమని సంస్థ వెల్లడించింది.

పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ (పీపీఏ)లలో జాప్యం, గ్రిడ్ కనెక్షన్ల ఆలస్యం, భూసేకరణలో ఎదురయ్యే సమస్యలు వంటి కీలక అడ్డంకులను అధిగమిస్తూ ప్రాజెక్టులను వేగంగా అమలు చేసేందుకు ‘లుమారా’ పనిచేయనుంది.

600 మిలియన్ డాలర్ల పెట్టుబడి

సౌర, పవన విద్యుత్‌తో పాటు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ (బీఈఎస్‌ఎస్) రంగాల్లో 6 గిగావాట్లకు పైగా సామర్థ్యం కలిగిన ప్రారంభ పోర్ట్‌ఫోలియో ఆధారంగా సుమారు 600 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాలని బ్రూక్‌ఫీల్డ్ లక్ష్యంగా పెట్టుకుంది.

2030 లక్ష్య సాధనకు తోడ్పాటు

బ్రూక్‌ఫీల్డ్ మేనేజింగ్ పార్ట్‌నర్, దక్షిణాసియా–మధ్యప్రాచ్య ఇంధన విభాగాధిపతి నవాల్ సైని మాట్లాడుతూ, 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యం సాధించాలనే భారత్ లక్ష్యానికి లుమారా దోహదపడుతుందని తెలిపారు. ప్రాజెక్టులను ప్రారంభ దశలోనే ముందుకు తీసుకెళ్లి, దేశీయ ఇంధన సామర్థ్యాన్ని వేగంగా పెంచడమే దీని ఉద్దేశమని చెప్పారు.

సీటీఎఫ్ నిధుల ద్వారా పెట్టుబడులు

వర్ధమాన మార్కెట్లలో స్వచ్ఛ ఇంధనం, ఇంధన పరివర్తన ప్రాజెక్టులకు పెట్టుబడులు అందించే కాటలిటిక్ ట్రాన్సిషన్ ఫండ్ (సీటీఎఫ్) ద్వారా లుమారాలో పెట్టుబడులు పెట్టనున్నట్లు బ్రూక్‌ఫీల్డ్ వెల్లడించింది.

భారత్‌లో ఇప్పటికే 32 బిలియన్ డాలర్ల పెట్టుబడులు

ప్రస్తుతం బ్రూక్‌ఫీల్డ్ ఇంధన పోర్ట్‌ఫోలియోలో 45 గిగావాట్ల పవన, సౌర విద్యుత్ ప్రాజెక్టులు కార్యకలాపాల్లో లేదా నిర్మాణ దశలో ఉన్నాయి. భారత్‌లో మౌలిక సదుపాయాలు, ఇంధనం, రియల్ ఎస్టేట్, ప్రైవేట్ ఈక్విటీ రంగాల్లో ఇప్పటికే 32 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టినట్లు సంస్థ తెలిపింది.