లష్కర్ బోనాలకు ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్, ఆంధ్రప్రభ : సికింద్రాబాద్‌లో జరిగే శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర సందర్భంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులను ప్రకటించారు. ఆగస్టు 2 నుంచి ఆగస్టు 4వ తేదీ జాతర ముగిసే వరకు ఆలయం చుట్టూ రెండు కిలోమీటర్ల పరిధిలో ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. భక్తులు, నగరవాసులు తమ ప్రయాణాన్ని ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని సూచించారు.
జాతర సందర్భంగా కర్బాలా మైదాన్, రాణిగంజ్, రాంగోపాల్‌పేట్, ప్యారడైజ్, సీటీఓ, ప్లాజా, ఎస్బీఐ క్రాస్ రోడ్స్, వైఎంసీఏ, సెయింట్ జాన్స్ రోటరీ, సంగీత్, ప్యాట్నీ, పార్క్ లేన్, బాటా, ఘాస్మండి, బైబిల్ హౌస్, మినిస్టర్స్ రోడ్, రసూల్‌పురా తదితర ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ రద్దీ ఉండే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు.
పూర్తిగా మూసివేసే రహదారులు…
ఆగస్టు 2 అర్ధరాత్రి 12 గంటల నుంచి ఆగస్టు 4 ఉదయం 3 గంటల వరకు క్రింది రహదారుల్లో సాధారణ వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిపివేయనున్నారు.
పొగాకు బజార్, హమాలీ విగ్రహం నుంచి మహంకాళి ఆలయానికి వెళ్లే మార్గం
బాటా క్రాస్ రోడ్స్ నుంచి రోచా బజార్ వరకు సుభాష్ రోడ్
అడవియ్య క్రాస్ రోడ్స్ నుంచి మహంకాళి ఆలయానికి వెళ్లే హిల్ స్ట్రీట్
జనరల్ బజార్ నుంచి మహంకాళి ఆలయానికి వెళ్లే రహదారి
ప్రధాన ట్రాఫిక్ మళ్లింపులు
ప్యాట్నీ, ఘాస్మండి, బైబిల్ హౌస్, కర్బాలా, రాణిగంజ్, ప్యారడైజ్ కూడళ్ల వద్ద ప్రత్యేక ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేస్తారు. ట్యాంక్‌బండ్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, బేగంపేట్, తిరుమలగిరి, ఎంజీ రోడ్, బైబిల్ హౌస్ వైపు వెళ్లే వాహనాలను పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఆర్టీసీ బస్సులకు కూడా ప్రత్యేక మార్గాలను నిర్ణయించారు.
భక్తులకు ప్రత్యేక పార్కింగ్
భక్తుల సౌకర్యార్థం హరిహర కళాభవన్, మహబూబ్ కాలేజ్, సీఎంఆర్ షాపింగ్ మాల్, ఓల్డ్ జైలు ఖానా ఖాళీ స్థలం, ఇస్లామియా హైస్కూల్, అడవియ్య మెమోరియల్ హైస్కూల్, నల్లగుట్ట జీహెచ్ఎమ్సీ గ్రౌండ్, వెస్లీ కాలేజ్, జింఖానా గ్రౌండ్, స్వప్నలోక్ కాంప్లెక్స్, తాజ్ త్రిస్టార్, పార్సీ టెంపుల్ తదితర ప్రాంతాల్లో రెండు చక్రాల, నాలుగు చక్రాల వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేశారు.
ప్రజలకు ట్రాఫిక్ పోలీసుల సూచనలు
జాతర రోజుల్లో నగరవాసులు, ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ముందుగానే ప్రణాళిక చేసుకుని ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని ట్రాఫిక్ పోలీసులు కోరారు. అత్యవసర పరిస్థితుల్లో ట్రాఫిక్ హెల్ప్‌లైన్ 9010203626ను సంప్రదించాలని సూచించారు. అలాగే హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల అధికారిక సామాజిక మాధ్యమాల ద్వారా తాజా ట్రాఫిక్ సమాచారాన్ని తెలుసుకుంటూ పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రకటన విడుదల చేశారు.
