విశారదన్ అరెస్ట్‌పై ఆగ్రహం
ఖండించిన జేఏసీ
కమ్మర్‌పల్లి, ఆంధ్రప్రభ : జగిత్యాల జిల్లా నూకపల్లిలో డబుల్ బెడ్రూం కాలనీ వాసుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన ధర్నాలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ అధ్యక్షుడు డా. విశారదన్ మహారాజ్‌ను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని కమ్మర్‌పల్లి మండల బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ నాయకుడు గుర్రం నరేష్ తీవ్రంగా ఖండించారు.
శుక్రవారం ఆయన మాట్లాడుతూ, ప్రజల సమస్యలను పరిష్కరించడం, మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. ప్రజల తరఫున పోరాడిన డా. విశారదన్ మహారాజ్‌ను అరెస్ట్ చేయడం సమంజసం కాదని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎక్కడ ప్రజా సమస్యలు ఉన్నా అక్కడికి వెళ్లి బాధితులకు అండగా నిలుస్తున్న విశారదన్ మహారాజ్‌ను ప్రతిసారీ అరెస్ట్ చేయడం ఎందుకని ప్రశ్నించారు. ప్రభుత్వాలు ప్రజలకు అవసరమైన పనులు సకాలంలో పూర్తి చేస్తే ఇలాంటి ఆందోళనలకు అవసరం ఉండదని అన్నారు.
నూకపల్లి డబుల్ బెడ్రూం కాలనీ వాసులకు మౌలిక వసతులు కల్పించే బాధ్యతను ప్రభుత్వం వెంటనే తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే విశారదన్ మహారాజ్ అరెస్ట్‌కు నిరసనగా బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ, ధర్మసమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జగిత్యాల బంద్‌కు పిలుపునిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.
