ఉపాధ్యాయుడికి ‘వ్యాసమహర్షి ఉత్తమ ఆచార్య పురస్కారం’

రాజమహేంద్రవరంలో రాష్ట్రస్థాయి గురుపౌర్ణిమ వేడుకల్లో ఘన సత్కారం


మండవల్లి, జులై 29 (ఆంధ్రప్రభ ) : మండవల్లి మండలంలోని ఇంగిలిగపాకలంక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న విశ్వనాథుని రామోజీరావుకు హిందూ ఉపాధ్యాయ సమితి ప్రతిష్ఠాత్మకంగా ప్రదానం చేసే ‘వ్యాసమహర్షి ఉత్తమ ఆచార్య పురస్కారం’ లభించింది.

రాజమహేంద్రవరంలో హిందూ ఉపాధ్యాయ సమితి ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో ఘనంగా నిర్వహించిన పుష్కర ప్రధానోత్సవం సందర్భంగా, గురుపౌర్ణిమ (వ్యాసపౌర్ణిమ) వేడుకల్లో ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. రాజమహేంద్రవరం ఇస్కాన్ చైర్మన్ సత్య గోపీనాథ్ ప్రభూజి చేతుల మీదుగా రామోజీరావు అవార్డును అందుకున్నారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ… భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, నైతిక విలువలను విద్యార్థుల హృదయాల్లో నాటే గొప్ప బాధ్యత ఉపాధ్యాయులదేనని పేర్కొన్నారు. విద్యతో పాటు విలువలను బోధించే గురువులే సమాజానికి నిజమైన మార్గదర్శకులని హిందూ ఉపాధ్యాయ సమితి జాతీయ అధ్యక్షుడు మహేష్ డేగల అన్నారు.

రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన ఉత్తమ ఉపాధ్యాయులను ఈ సందర్భంగా సత్కరించారు. కార్యక్రమంలో హిందూ ఉపాధ్యాయ సమితి రాష్ట్ర, జిల్లా ప్రతినిధులు, పలువురు విద్యావేత్తలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రామోజీరావుకు రాష్ట్రస్థాయి పురస్కారం లభించడం పట్ల సహచర ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు అభినందనలు తెలిపారు.