గురువే దైవం.. వ్యాసుడే ఆదిగురువు

వ్యాస మహర్షి తపోభూమి బాసర… జ్ఞాన సరస్వతి క్షేత్ర మహిమ

నిజానికి వ్యాసుడు అనేది ఒక పదవి పేరు. ప్రతీ ద్వాపరయుగం లోనూ ఒక వ్యాసుడు ఉద్భవిస్తాడు. సాక్షాత్తు ఆ శ్రీమన్నారయణుడే వ్యాసుడుగా అవతరిస్తాడు. ఈ అనంతంగా తిరిగే కాలచక్రంలో ధర్మం కృతయుగంలో 4 పాదాలతో , త్రేతాయుగంలో 3 పాదాలతో , ద్వాపరయుగంలో2 పాదాలతో , ఈ కలియుగంలో 1 వ పాదంతో , నడుస్తుంది.

ఆదిగురువు వేదవ్యాసులవారు. వ్యాసులవారు పుట్టినరోజునే గురుపూర్ణిమ , వ్యాసపూర్ణిమ , అంటారు

నారాయణమూర్తి స్వరూపమే వేదవ్యాసులవారు. అందుకే ఆయన్ని అపర నారాయణుడని పిలుస్తారు. వేదవిభజన చేసిన మహానుభావుడాయన. ఆయనవల్లనే మనకు అష్టాదశ పురాణాలు ఏర్పడ్డాయి. భారత భాగవతాలనందించినవారే వ్యాసులవారు.

వ్యాసమహర్షి ఒక వ్యక్తి పేరు మాత్రమే కాదు. ప్రతి ద్వాపర యుగములోను ఒక సారి వ్యాసుడు ఉద్భవిస్తాడు.
ఆయన జన్మించిన తిథి అయిన ఆషాఢ శుద్ధ పూర్ణిమను గురు పూర్ణిమ గా జరుపుకుంటాం. లోకానికంతటికీ జ్ఞానాన్ని అందించిన గురువు వ్యాసుడు కాబట్టి వ్యాసుని జన్మ తిథిని గురు పూర్ణిమగా జరుపుకోవడం ఆచారమైంది.

ఇతడు పరాశర మహర్షికి , మత్స్య గంధికి (సత్యవతి) కి కృష్ణ వర్ణం (నల్లని రంగు) తో ఒక ద్వీపంలో జన్మించారు కనుక కృష్ణద్వైపాయనుడు అని పిలవబడ్డాడు. పుట్టీ పుట్టగానే చేతిలో కమండలం , దండము చేతబట్టి తపస్సు చేసుకోవటానికి వెళ్తానని తల్లి మత్ష్యగంధి అనుమతితో తపస్సుకు వెళ్ళిన తపోధనుడు కృష్ణద్వైపాయనుడు.

వ్యాస మహర్షి నాలుగు వేదాలను విభజించి లోకానికి అందించాడని పురాణాలు చెబుతున్నాయి. పూర్వం సోమకాసురుడు వేదాలను సముద్రంలో దాచేస్తే.. శ్రీ మహా విష్ణువు మత్స్యావతారంలో ఆ వేదాలను తీసుకొచ్చాడు. అలా వచ్చిన వేదాలు ఒకదానితో ఒకటి కలిసి కలగాపులగం అయిపోగా.. వాటిని వ్యాస మహర్షి విడదీసి విభజించి నాలుగు వేదాలుగా లోకానికి అందించాడు. వేదరాశి ని నిత్య కర్మలలో క్రతువుల్లో వాడే ఉపయోగాలను బట్టి ఋక్-యజుర్-సామ-అధర్వణ వేదాలుగా విభజించి వేదవ్యాసుడైనాడు. ఆతర్వాత బ్రహ్మదేవుని ఆజ్ఞతో విఘ్నేశ్వరుడు రాయగా … వేదసారాన్నంతా చేర్చి పంచమవేదంగా ప్రసిద్ధికెక్కిన భారత ఇతిహాసాన్ని గ్రంధస్తం చేసాడు. అంతేకాక భాగవతాన్ని , అష్టాదశ పురాణాలను మనకు ప్రసాదించాడు. సాక్షాతు శ్రీ మహా విష్ణువు అవతారంగా భావించే వ్యాస భగవానుని గానూ ఆదిగురువుగానూ భావిస్తారు.

విష్ణు సహస్రనామములో కూడా

“వ్యాసాయ విష్ణు రూపాయ – వ్యాస రూపాయ విష్ణవే
నమోవై బ్రహ్మ నిధయే వాశిష్టాయ నమోనమ: !!

అని వ్యాసునికి విష్ణువుకు అభేదం చెప్ప బడింది , వేదవ్యాసుడు అనంతంగా ఉన్న వేదాలని విభజించి పైలుడను శిష్యునకు ఋక్సంహితను , వైశంపాయనునకు యజుస్సంహితను , జైమినికి సామసంహితను , సుమంతునకు అధర్వణ సంహితను భోధించి వానిని లోకములో వ్యాప్తి చేయండని ఆదేశించాడు. వ్యాసుడు వేదాలని విభజించటమే కాకుండా అష్టా దశ పురాణాల్ని , ఉపపురాణాలను రచించాడు. బ్రహ్మసూత్రాల్ని వివరించాడు , భారత , భాగవతాలని రచించాడు. తాను గ్రంథస్థం చేసిన పురాణేతిహాసములను సూతునకు తెలియజేసి ప్రచారం చేయమని చెప్పాడు.

వ్యాస భగవానుని అనుగ్రహం వలన జ్ఞానం విస్తరించి విశ్వవ్యాప్తం అయ్యింది. సూత మహాముని ప్రథాన ప్రచారకుడై విషయములు బహుళ ప్రచారం చేసాడు.

వ్యాసం వశిష్ఠనప్తారం శక్తే , పౌత్రమకల్మషమ్ |
పరాశరాత్మజమ్ వందే శుక తాతం తపోనిధిమ్

తాత్పర్యం:- వశిష్టుని మునిమనుమడైన కల్మష రహితుడైన శక్తికి మనుమడైన పరాశరుని కుమారుడైన , శుకమహర్షి తండ్రి అయిన ఓ వ్యాస మహర్షి నీకు వందనము.

ఇంతటి మహోన్నతమైనటువంటి మహానుభావుడైన సాక్షాత్తు
మహా విష్ణు స్వరూపమైనటువంటి వేదవ్యాస మహర్షుల వారు మహాభారత యుద్ధానంతరము
దండకారణ్య ప్రదేశంలో అనగా ప్రస్తుతమన తెలంగాణ రాష్ట్రంలో పూర్వ ఆదిలాబాద్ జిల్లా ఇపుడు నిర్మల్ జిల్లాగా పిలవబడుతున్న ఈ ప్రదేశంలో గోదావరి నది తీరంలో సాక్షాత్తు సరస్వతి అమ్మవారి కోసం కొన్ని సంవత్సరములు విశేషమైనటువంటి తపస్సును ఆచరించి అమ్మవారి సాక్షాత్కారం పొంది ఈ గోదావరి నది నుండే సైకతమును అనగా ఇసుకను తీసుకుని మహాకాళి మహాలక్ష్మి శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవార్లుగా సైకతమూర్తులను ప్రతిష్టించి సూర్యచంద్రాదులు ఉన్నంతకాలం జ్ఞానార్థులై జ్ఞాన బిక్ష కోసం వారి వారి కోరికల సిద్ధి కోసం ఈ వ్యాసపుర క్షేత్రానికి వచ్చేటువంటి భక్తులందరికీ జ్ఞానము మేధస్సు విద్యను ప్రసాదించవలసిందిగా మనందరికోసం అమ్మవారి దగ్గర వరాన్ని పొంది మనందరికీ కూడా అమ్మవారి కటాక్షం లభించేలా అనుగ్రహించినటువంటి ఋషి పుంగవుడు భగవత్ స్వరూపుడు అయిన వేద వ్యాసుల వారి యొక్క జన్మదినోత్సవాన్ని ప్రపంచమంతా కూడా గురు పౌర్ణమి గా జరుపుకుంటారు అటువంటి మహత్తరమైనటువంటి రోజును మనము సాక్షాత్తు ఆ మహానుభావుడు నడయాడినటువంటి ఈ బాసర క్షేత్రంలో జరుపుకోవడం ఎన్నో జన్మల పుణ్యఫలం కావున భక్తులంతా కూడా ఇట్టి వ్యాసపౌర్ణమి మహోత్సవాలలో అధిక సంఖ్యలో పాల్గొని సాక్షాత్తు వేదవ్యాస మహర్షుల వారి మరియు జ్ఞాన సరస్వతి అమ్మవారి అనుగ్రహం పొందగలరని కోరుచున్నాము

“వ్యాసో నారాయణో హరిః”