వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ

  • ఆషాఢ పౌర్ణమి సందర్భంగా విశేషంగా తరలివచ్చిన భక్తులు…
  • మంగళవాయిద్యాలు, వేదఘోషలు, భజనలు, సంప్రదాయ కళారూపాల మధ్య….
  • ప్రదక్షణను ప్రారంభించిన చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో శీనా నాయక్
  • మార్గమంతా కుంకుమ, ప్రసాదాల పంపిణీ..
  • పసుపు నీళ్లతో స్వాగతం పలికి హారతులు ఇచ్చిన మహిళలు

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ: ఆషాఢ పౌర్ణమి సందర్భంగా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై నిర్వహించిన గిరి ప్రదక్షిణ బుధవారం భక్తి పారవశ్య వాతావరణంలో అత్యంత వైభవంగా జరిగింది. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారు, శ్రీ కనకదుర్గమ్మతో పాటు శ్రీ విఘ్నేశ్వరుడు, శ్రీ సుబ్రహ్మణ్యస్వామి, శ్రీ ఆంజనేయస్వామి తదితర దేవతలు కొలువైన ఇంద్రకీలాద్రి చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వసించే భక్తులు వేలాదిగా పాల్గొన్నారు.

పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణకు మరింత విశిష్టత ఉందని వేదపండితులు పేర్కొన్నారు. బుధవారం ఉదయం ఘాట్‌రోడ్‌ ప్రవేశద్వారం వద్ద ఉన్న శ్రీ కామధేను అమ్మవారి సన్నిధి నుంచి గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేవస్థానం స్థానాచార్యులు వి. శివప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

కళాకారుల ప్రదర్శనలతో…

దేవస్థానం ధర్మప్రచార విభాగం ఆధ్వర్యంలో సంప్రదాయ తప్పెట్లు, కోలాట నృత్యాలు, భజన సంకీర్తనలు, మంగళవాయిద్యాలు, వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య గిరి ప్రదక్షిణ నిర్ణయించిన మార్గంలో ఘనంగా సాగింది. ఘాట్‌రోడ్‌లోని అమ్మవారి ఆలయం, కుమ్మరిపాలెం సెంటర్, విద్యాధరపురం, పాలప్యాక్టరీ, చిట్టినగర్, కొత్తపేట, బ్రాహ్మణవీధి మీదుగా తిరిగి ఇంద్రకీలాద్రికి చేరుకుంది.గిరి ప్రదక్షిణ మార్గమంతా స్థానిక మహిళలు పసుపు నీళ్లతో రహదారులను శుద్ధి చేసి, హారతులు, కొబ్బరికాయలు సమర్పిస్తూ స్వామి–అమ్మవారికి ఘన స్వాగతం పలికారు. భక్తులకు దేవస్థానం ఆధ్వర్యంలో కుంకుమ, ప్రసాదాలను పంపిణీ చేశారు.

వేలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొని శ్రీ కనకదుర్గమ్మ, శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల అనుగ్రహం పొందారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు ఆర్. శ్రీనివాస శాస్త్రి, ధర్మకర్తల మండలి సభ్యుడు అవ్వారు శ్రీనివాసరావు, ఇతర అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.