సీసీ కెమెరాలతోనే నేరాలకు చెక్: ఎస్సై శోభన్‌బాబు
- సోలిపురం గ్రామంలో సైబర్ నేరాలపై అవగాహన
- త్వరలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని సర్పంచ్ హామీ
మునుగోడు, ఆంధ్రప్రభ : గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే దొంగతనాలు, ఇతర నేరాలను సమర్థంగా అరికట్టవచ్చని మునుగోడు ఎస్సై శోభన్‌బాబు అన్నారు. మండలంలోని సోలిపురం గ్రామాన్ని మంగళవారం సందర్శించిన ఆయన గ్రామస్థులకు సైబర్ నేరాల నివారణ, భద్రతా చర్యలపై అవగాహన కల్పించారు.
సైబర్ మోసగాళ్ల బారిన పడకుండా అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, సందేశాలు, లింకులను నమ్మవద్దని సూచించారు. బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీ, ఏటీఎం పిన్ వంటి గోప్య సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ వెల్లడించవద్దని ప్రజలకు సూచించారు.
గ్రామంలో అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా, ఎలాంటి అనుమానాస్పద ఘటనలు జరిగినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. గ్రామంలోని ప్రధాన కూడళ్లు, వీధుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే నేరస్థులను గుర్తించడం, దర్యాప్తు చేపట్టడం మరింత సులభమవుతుందని తెలిపారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ నకిరేకంటి మురళీకృష్ణ స్పందిస్తూ, సోలిపురం గ్రామంలో త్వరలోనే సీసీ కెమెరాల ఏర్పాటు చేపడతామని హామీ ఇచ్చారు. అనంతరం ఎస్సై శోభన్‌బాబును శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
