వికసిత్ భారత్–స్వర్ణాంధ్ర లక్ష్యాలకు కృషి చేయాలి: లంకా దినకర్

ఏలూరు, ఆంధ్రప్రభ: వికసిత్ భారత్- స్వర్ణాంధ్ర లక్ష్యాలకు అనుగుణంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేసేలా అధికారులు కృషి చేయాలనీ ఇరవై సూత్రాల కార్యక్రమం (వికసిత్ భారత్ -స్వర్ణ ఆంధ్రప్రదేశ్) అమలు చైర్మన్ లంకా దినకర్ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని గోదావరి సమావేశ హాలులో మంగళవారం కేంద్ర ప్రభుత్వ పథకాలు, కొల్లేరులో ప్రస్తుత పరిస్థితి, మత్స్యకారుల జీవనోపాధి, పర్యాటక అభివృద్ధి, విద్య, వైద్యం, అమృత్, జల్ జీవన్ మిషన్ పనులు పురోగతి, ప్రధానమంత్రి సూర్యఘర్ , ప్రధానమంత్రి కుసుమ్, వి.బి.జి. రామ్ జి., కార్యక్రమాలపై అధికారులతో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, ఎమ్మెల్యేలు డా. కామినేని శ్రీనివాస్, చింతమనేని ప్రభాకర్, సొంగా రోషన్ కుమార్ లతో కలిసి చైర్మన్ లంకా దినకర్ సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాయని, ఆ కార్యక్రమాల ద్వారా ప్రజలకు ఏ విధమైన లబ్ధి కలిగించాలనే ప్రభుత్వ ఆశయాలను పూర్తి స్థాయిలో అర్థం చేసుకుంటూ, అందుకు అనుగుణంగా పథకాల అమలు చేసేలా అధికారులు పని చేయాలన్నారు. జల్ జీవన్ మిషన్, అమృత్ పధకాల ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో ప్రతీ గృహానికి నీటి కుళాయి అందించేందుకు ఆ ప్రాంతానికి సుస్థిర నీటి నిల్వ వనరులు గుర్తించిన అనంతరం ఇంటికి కుళాయి కనెక్షన్ అందించాలన్నారు.

గత ప్రభుత్వ సమయంలో జల్ జీవన్ మిషన్, అమృత్ పథకాల ద్వారా సుస్థిర నీటి వనరులను గుర్తించకుండానే కుళాయి కనెక్షన్లు అందించారని, వాటి కారణంగా అవి అలంకారప్రాయంగా మారాయన్నారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం జలధార-జలహారతి కార్యక్రమం ద్వారా ప్రతీ గ్రామంలోనూ నీటి వనరులలో నీటి నిల్వ సామర్ధ్యం పెంచేలా చర్యలుతీసుకున్నదన్నారు.

కొల్లేరు సమస్య పరిష్కార విషయంలో సుకుమార్ కమిటీ సూచనల మేరకు కొల్లేరులో జిరాయితీ భూమిదారుల హక్కులను కాపాడడంతోపాటు, అభయారణ్యం, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ, కొల్లేరుప్రాంతంలోని మత్స్యకార కుటుంబాలు సాంప్రదాయ చేపలవేటతో వారి జీవన ప్రమాణాలు మెరుగయ్యేలా కార్యాచరణ ప్రణాళికలను జిల్లా యంత్రాంగం కేంద్ర సాధికార కమిటీకి నివేదిక అందించిందన్నారు. వికసిత్ భారత్ – స్వర్ణాంధ్ర సాధనకు మెరుగైన మానవ వనరులు, ఆరోగ్యవంతమైన సమాజం ఎంతో ప్రధానమైనదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్య, వైద్యం పై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాయన్నారు.

పాఠశాలల్లోని విద్యార్థినీవిద్యార్థులకు, అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, మహిళలు, పిల్లలకు సంపూర్ణ పోషకాహారం అందించాలని, విద్యార్థినీ, విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తూ వారిలో రక్తహీనత, తదితర ఆరోగ్య సమస్యలు లేకుండా విద్య, వైద్య, ఐసిడిఎస్ అధికారులు సమన్వయంతో చికిత్సలు అందించేలా చర్యలుతీసుకోవాలన్నారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పధకం ద్వారా పోషకాలతో నిండిన ఆహారాన్ని విద్యార్థులకు అందించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డుల్లో విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి అంశాలు కూడా పొందుపరిచేలా చర్యలు తీసుకోవాలన్నారు.

వీబీజీ రామ్ జీ పథకంలో కేంద్ర ప్రభుత్వం పనిదినాలు 125 రోజులకు పెంచిందని, అర్హత కలిగిన ప్రతీ ఒక్క కూలీకి జాబ్ కార్డు అందించడంతోపాటు పని కల్పించాలని, మెటీరియల్ విభాగంలో కన్నా, వేతనాల పద్దులో అధికంగా పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. గర్భిణీ స్త్రీలు ప్రసవాలు తప్పనిసరిగా ఆసుపత్రులలోనే జరిగేలా చర్యలు తీసుకోవాలని, గర్భిణీలకు పోషకాహార లోపం లేకుండా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం మాతృత్వ వందన యోజన, వంటి పధకాల ద్వారా ఆర్ధిక సహాయాన్ని అర్హులైన ప్రతీ ఒక్కరికీ అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో మాతా, శిశు మరణాలు లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం ద్వారా మెరుగైన సేవలందేలా చూడాలన్నారు.

జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పూర్తిస్థాయిలో అమలు చేస్తూ ఏలూరు జిల్లాను అభివృద్ధిలో రాష్ట్రంలో 10 స్థానంలోపు నిలిపేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రధానమంత్రి సూర్యఘర్ కార్యక్రమంలో రాష్ట్రంలో ఏలూరు జిల్లాను ప్రధమ స్థానంలో నిలిపామన్నారు. వీబీజీ రామ్‌ జీ పథకంలో 437 కోట్ల రూపాయలతో గ్రామీణ ప్రాంతాలలో 427 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణ పనులు చేపడుతున్నామన్నారు. కొల్లేరులో జిరాయితీ భూమిదారుల హక్కులను కాపాడడంతోపాటు, అభయారణ్యం, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ, కొల్లేరుప్రాంతంలోని మత్స్యకార కుటుంబాలు సాంప్రదాయ చేపలవేటతో వారి జీవన ప్రమాణాలు మెరుగయ్యేందుకు తీసుకోవలసిన చర్యలపై కేంద్ర సాధికార కమిటీ కి నివేదిక అందించామన్నారు.

కైకలూరు శాసనసభ్యులు డా. కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ.. కొల్లేరు అభయారణ్యంలో 15 వేల ఎకరాల వరకు జిరాయితీ భూమిదారులున్నారన్నారు. కొల్లేరులో నివాసిత ప్రాంతాలలో రోడ్లు, త్రాగునీరు, విద్యుత్ వంటి కనీస వసతి సౌకర్యాలు కల్పించాలన్నారు కొల్లేరు ప్రాంతంలో మకానా బోర్డు ఏర్పాటుచేయాలని ముఖ్యమంత్రిని కోరగా, 3 రోజులలో కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారన్నారు. కొల్లేరు సమస్యకు శాశ్వత పరిష్కారదిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ.. దెందులూరు నియోజకవర్గ పరిధిలోని కొల్లేరు ప్రాంతంలో కొన్ని గ్రామాలలో రహదారి సౌకర్యం కల్పించాలని కోరారు. గత ప్రభుత్వ సమయంలో కొల్లేరులో అక్రమ చేపల చెరువుల తవ్వకాలపై విచారణ చేసి అక్రమాలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.

చింతలపూడి శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ మాట్లాడుతూ.. ప్రసవాలు తప్పనిసరిగా ఆసుపత్రులలోనే జరిగేలా వైద్యాధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం పెరిగేలా మెరుగైన వైద్య సేవలందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాల స్థాయిలో విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వాటి వివరాలను పాఠశాల లీప్ యాప్ లో పొందుపరిచేలా చూడాలన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టరు డా.యం.జె. అభిషేక్ గౌడ, జిల్లా అటవీశాఖ అధికారి పి.వి.సందీప్ రెడ్డి, జిల్లా రెవిన్యూ అధికారి యం.శ్రీదేవి, జెడ్పీ సిఈవో పి.జగదాంబ, ఆర్డీవో కె.లక్ష్మీప్రసన్న , డిఎఫ్ఓ త్రిమూర్తులు రెడ్డి, ఏలూరు నగరపాలక సంస్థ కమీషనర్ ఏ . భానుప్రతాప్, జిల్లా పంచాయతీ అధికారి మల్లికార్జునరావు, డిఎంహెచ్ఓ డా.శోభా, డిసిహెచ్ ఎస్ డా.బేబీ కమల పాల్గొన్నారు.