మంగపేటలో ఈదురుగాలుల బీభత్సం

ములుగు జిల్లా, మంగపేట, ఆంధ్రప్రభ : ములుగు జిల్లా మంగపేట మండలంలో మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా వీచిన బలమైన ఈదురుగాలులు, సుడిగాలులతో అటవీ ప్రాంతం అతలాకుతలమైంది. భారీ వృక్షాలు నేలకొరగడంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మంగపేట నుంచి కోమటిపల్లి వెళ్లే మార్గంలో సండ్రోని ఒర్రె దాటి శాంతినగర్‌కు వెళ్లే రహదారి సమీపంలోని అటవీ ప్రాంతంలో మహావృక్షాలు నేలకూలాయి. పలుచోట్ల చెట్లు రోడ్డుపై పడిపోవడంతో కొంతసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

ఈ ఘటన 2024 ఆగస్టు 31న తాడ్వాయి మండలం మేడారం అటవీ ప్రాంతంలో ఈదురుగాలులకు భారీ సంఖ్యలో చెట్లు నేలకొరిగిన ఘటనను తలపించిందని స్థానికులు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న మంగపేట పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని రహదారిపై పడిపోయిన చెట్లను తొలగించే చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదని అధికారులు తెలిపారు.