వర్షాభావ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటల సాగు మేలు
వరి సాగుకు బదులుగా ఆరుతడి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలి: మోహన్రావు
నేరేడుచర్ల, ఆంధ్రప్రభ : ప్రస్తుత సీజన్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయడమే మేలని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి, మండల ప్రత్యేక అధికారి మోహన్రావు అన్నారు.
మంగళవారం నేరేడుచర్ల మండల పరిషత్ కార్యాలయంలో వి.బి.జి రామ్, ఎల్ నినో ప్రభావం, జల సిరిపై సర్పంచులు, గ్రామ కార్యదర్శులతో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఎల్నినో వాతావరణ పరిస్థితుల కారణంగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు.
ప్రస్తుత సీజన్లో వరి సాగుకు బదులుగా తక్కువ నీటి వినియోగం కలిగిన అంతర పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ విషయంపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను కోరారు. గతంలో 3.75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు వెల్లడించారు.
మండల వ్యవసాయ అధికారి జావిద్ మాట్లాడుతూ సూపర్ ఎల్నినో ప్రభావంతో పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు పెరిగి నైరుతి రుతుపవనాల ప్రభావం తగ్గడంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు.
రైతులు లక్షలాది రూపాయలు వెచ్చించి బోర్లు వేసి నష్టపోవద్దని సూచించారు. వరి సాగు వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయి పంట పొట్ట దశలో ఉన్న సమయంలో నీరందక రైతులు నష్టపోయే అవకాశం ఉందన్నారు. వరికి బదులుగా ఆరుతడి పంటలను సాగు చేసుకోవాలని కోరారు.
ఈ సమావేశంలో ఎంపీడీవో సోమసుందర్రెడ్డి, తహశీల్దార్ సురిగి సైదులు, ఎంపీవో నాగరాజు, వైద్యాధికారులు పున్న నాగిని, సీతా మహాలక్ష్మి, వివిధ గ్రామాల సర్పంచులు, కార్యదర్శులు పాల్గొన్నారు.
