ఉప సర్పంచుల సమస్యల పరిష్కారానికి వినతి
గౌరవ వేతనాలు, హక్కులు కల్పించాలని అదనపు కలెక్టర్‌కు విజ్ఞప్తి
కామారెడ్డి, ఆంధ్రప్రభ : ఉప సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ఉప సర్పంచుల ఫోరం నాయకులు కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. విక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు.
రాష్ట్ర ఉప సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బోట్ల కార్తీక్ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు దుంపటి రాజు ఆధ్వర్యంలో నాయకులు అదనపు కలెక్టర్‌ను కలిసి సమస్యలను వివరించారు.
ఈ సందర్భంగా దుంపటి రాజు మాట్లాడుతూ ఉప సర్పంచులకు నెలకు రూ.5,000, వార్డు సభ్యులకు నెలకు రూ.3,000 గౌరవ వేతనం మంజూరు చేయాలని కోరారు. గ్రామాల్లో ఏర్పాటు చేసే శిలాఫలకాలపై ఉప సర్పంచులు, వార్డు సభ్యుల పేర్లను కూడా పొందుపరచాలని విజ్ఞప్తి చేశారు.
ఉప సర్పంచులకు చట్టబద్ధమైన హక్కులు, అధికారాలు, విధులను స్పష్టంగా అమలు చేసి గ్రామపంచాయతీల్లో వారి పాత్రను బలోపేతం చేయాలని కోరారు. మండల స్థాయి అధికారిక కార్యక్రమాలకు ఉప సర్పంచులను తప్పనిసరిగా ఆహ్వానించాలని, గ్రామాభివృద్ధిలో వారికి తగిన గుర్తింపు కల్పించాలని తెలిపారు.
వినతి పత్రాన్ని స్వీకరించిన అదనపు కలెక్టర్ వి. విక్టర్ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఉప సర్పంచుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని, అవసరమైతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని దుంపటి రాజు తెలిపారు. పెద్దపల్లి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఉప సర్పంచ్ రవి కుటుంబ సభ్యులకు జిల్లా ఉప సర్పంచుల ఫోరం తరఫున సానుభూతి తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రావణ్ గౌడ్, జిల్లా గౌరవ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి స్వామి, బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జ్ సంజీవ్, జుక్కల్ నియోజకవర్గ ఇన్చార్జ్ నాగరాజు, జిల్లా మైనార్టీ సెల్ ఇమ్రాన్, వార్డు మెంబర్స్ జిల్లా కన్వీనర్ వికాస్ గౌడ్, రాష్ట్ర కమిటీ సభ్యుడు దేవరాజు, వివిధ మండలాల అధ్యక్షులు, గ్రామాల ఉప సర్పంచులు పాల్గొన్నారు.
