వర్షాల కోసం బొడ్రాయికి జలాభిషేకం
చిట్యాల, ఆంధ్రప్రభ : చిట్యాల మండలంలోని సుంకేనపల్లి గ్రామంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని కోరుతూ బొడ్రాయి (నాభిశిల) వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మంగళవారం గ్రామ సర్పంచ్ ఆవుల సునీత–యాదయ్య దంపతుల ఆధ్వర్యంలో గ్రామ మహిళలు ప్రతి ఇంటి నుంచి బిందెలతో నీళ్లు తీసుకువచ్చి బొడ్రాయికి జలాభిషేకం చేశారు. గుమ్మడికాయ కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించి, వరుణదేవుడిని ప్రార్థించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ ఆవుల సునీత మాట్లాడుతూ, గ్రామంలో ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కాకపోవడంతో గ్రామపంచాయతీ పాలకవర్గం, గ్రామ పెద్దలతో చర్చించి ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు.
వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు సాగు చేసిన పంటలు బాగా పండాలని, గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని బొడ్రాయి, వరుణదేవుడిని ప్రార్థించినట్లు ఆమె పేర్కొన్నారు.
