ఆరుతడి పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలి
వాతావరణ మార్పులకు అనుగుణంగా సాగు విధానాలు అవలంబించాలని రైతులకు సూచన
టేకుమట్ల, ఆంధ్రప్రభ: జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం దుబ్యాల గ్రామంలో నిర్వహించిన రైతు అవగాహన సదస్సులో రైతులు సాంప్రదాయ పంటలతో పాటు ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ) కళ్యాణి, గ్రామ సర్పంచ్ సంగీ అంజలి సూచించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మారుతున్న వాతావరణ పరిస్థితులు, నీటి కొరత వంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
వేరుశనగ, పెసర్లు, మినుములు, జొన్నలు, ప్రత్తి వంటి ఆరుతడి పంటలు ప్రస్తుత పరిస్థితుల్లో లాభదాయకంగా ఉంటాయని తెలిపారు. రైతులు పంటల ఎంపికలో శాస్త్రీయ విధానాలను అనుసరించాలని సూచించారు.
ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలు, నాణ్యమైన విత్తనాలు, ఆధునిక సాగు పద్ధతులను సద్వినియోగం చేసుకొని మెరుగైన దిగుబడులు సాధించాలని రైతులకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.
