జయశంకర్ జయంతి ఉత్సవాల ఫోటో ఎగ్జిబిషన్ పోస్టర్ ఆవిష్కరణ
ఆగస్టు 6న జరిగే జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపు
హనుమకొండ, ఆంధ్రప్రభ: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతిని పురస్కరించుకుని మంగళవారం వరంగల్ కాశిబుగ్గ ఓసీటీ జంక్షన్లో టి.జేఏసీ నాయకులు ఆకెన వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో జయంతి ఉత్సవాల ఫోటో ఎగ్జిబిషన్ పోస్టర్ను ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ మానవ వనరుల అభివృద్ధి వేదిక కన్వీనర్ డాక్టర్ కొణతం కృష్ణ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా డాక్టర్ కొణతం కృష్ణ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆశయాలను భావితరాలకు చేరవేయడం ప్రతి తెలంగాణవాది బాధ్యత అని పేర్కొన్నారు.
ఆగస్టు 6న కాకతీయ యూనివర్సిటీ ఎస్డీఎల్సీఈ మహిళా ఇంజినీరింగ్ కళాశాల సెమినార్ హాల్లో నిర్వహించనున్న ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి ఉత్సవాలకు తెలంగాణవాదులు, విద్యార్థినీ విద్యార్థులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, కార్మిక సంఘాల నాయకులు, మేధావులు, వైద్యులు, న్యాయవాదులు, ఇంజినీర్లు, వివిధ రంగాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో టి.జేఏసీ నాయకులు పెరుమాండ్ల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
